మెర్క్యురీకి టైమ్‌ వచ్చింది!

19 Apr, 2018 18:01 IST|Sakshi

సాక్షి, సినిమా : ప్రభుదేవా మెర్క్యురీకి టైమ్‌ వచ్చింది. 48 రోజుల చిత్రపరిశ్రమ సమ్మె తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం, సినీ సంఘాలతో ఇటీవల జరిపిన ద్వైపాక్షిక చర్చలు సఫలం కావడంతో శుక్రవారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ బుధవారం వెల్లడించారు. అదేవిధంగా చిత్ర షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సమ్మె విరమణ తరువాత తెరపైకి వస్తున్న తొలి చిత్రంగా మెర్క్యురీ నమోదైంది. ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించిన ఇందులో రమ్యా నంబీశన్, మేయాదమాన్‌ చిత్రం ఫేమ్‌ ఇందుజా నాయికలుగా నటించారు. 

ఇది హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూఖీ చిత్రం. మొత్తం మీద ఇదో ప్రయోగాత్మక సైలెంట్‌ థ్రిల్లర్‌ చిత్రం. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని చిత్రపరిశ్రమ సమ్మె కొనసాగుతుండగానే విడుదల చేస్తానని దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ ప్రకటించారు. ఆ తరువాత సినీవర్గాల వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. అయితే తమిళంలో మినహా ప్రపంచవ్యాప్తంగా మెర్క్యురీ చిత్రం గత వారమే విడుదలైంది. అంతేకాదు ఈ చిత్రం​ ఇతర భాషల్లో వెబ్‌సైట్స్‌ల్లో కూడా హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ప్రభుదేవా ఈ చిత్రాన్ని పైరసీ సీడీలో చూడకండి అని విజ్ఞప్తి చేశారు. ఈ రీజన్‌తోనే అయ్యి ఉండవచ్చు సమ్మె విరమణ తరువాత మొదట ఈ చిత్రాన్ని విడుదలకు నిర్మాతల మండలి అనుమతి ఇచ్చి ఉండవచ్చు. అయితే దీనితో పాటు రెండు చిన్న చిత్రాలు శుక్రవారం తెరపైకి రానున్నాయి.

>
మరిన్ని వార్తలు