ప్రకృతే పెద్ద విలన్

28 Aug, 2014 00:10 IST|Sakshi
ప్రకృతే పెద్ద విలన్

 ఇక్కడ ఎవరు పెద్ద వారు కాదు. ప్రకృతే పెద్ద విలన్ అని దర్శకుడు ప్రభు సాల్మన్ తన తదుపరి చిత్రం కయల్ ద్వారా చెప్పనున్నారట. పర్ఫెక్షన్‌కు నూరు శాతం ప్రాముఖ్యతనిచ్చే దర్శకుడీయన. మైనా, కుంకీ చిత్రాలే ఇందుకు నిదర్శనం. తన ఊహా రచనకు సహజత్వంతో కూడిన హంగులు అద్ది విమర్శకులు సైతం మెచ్చేలా సెల్యులాయిడ్‌పై చిత్రాలను ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు ప్రభుసాల్మన్. తాజా చిత్రంలో కమల్‌ను అద్భుత కావ్యంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్ర విశేషాల గురించి ఆయనతో ముచ్చటిద్దాం.
 
  కయల్... ఈ పేరే కవితాత్మకంగా ఉందే?
 : ఇదొక రొమాంటిక్ కథా చిత్రం. కథకు తగ్గట్టుగా అలాంటి టైటిల్ కోసం ఆలోచించగా హీరోయిన్ పేరు కయల్ రొమాంటిక్‌గా ఉండడంతో దాన్నే టైటిల్‌గా నిర్ణయించాం.
 
 కథకు సునామీని నేపథ్యంగా తీసుకున్నారట?
  దానికంటే ముందు అందరికీ అర్థమయ్యేలా ఒక విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పదలిచాను. సునామీ రావడానికి ముందు రోజు డిసెంబర్ 25న పర్వదినం, వేడుకగా జరుపుకునే రోజు. అలా సంతోషంగా గడిపి 24 గంటలు గడవగానే అలాంటి ఒక దుర్దినం సంభవిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే మీరో, నేనో, ఇంకొకరో ఎవరు పెద్ద వాళ్లు కాదు. ప్రకృతే అందరికంటే పెద్ద విలన్. కొన్ని సెకన్లలోనే లక్షల మంది జీవితాలను అతలాకుతలంచేసి పోయింది. అందుకే జీవిస్తున్నప్పుడే నలుగురికి మంచి చెయ్యండి. ప్రేమతో పలకరించండి. జీవితం అనుభవించడానికే అంటాం. ఇప్పుడు మనం బతకడానికే ప్రయత్నిస్తున్నాం. అయితే బతకడానికి, జీవించడానికి మధ్య వ్యత్యాసం తెలియకుండానే కాలం గడిపేస్తున్నాం. ఈ విషయాన్నే కయల్ చిత్రంలో చెబుతున్నాను.
 
  డి.ఇమాన్ మ్యూజిక్ వర్కౌట్ అవుతుందా?
  మైనా, కుంకీ, చిత్రాల కంటే ఈ చిత్రంలో పాటలకు కొంచెం అధికంగానే ప్రాముఖ్యత ఉంటుంది. ఎలక్ట్రానిక్ సంగీతం కాకుండా అంతా లైవ్ సంగీతాన్ని అందిస్తున్నాం. వంద, నూట యాబై వయలెన్స్, పిల్లన గ్రోవిలాంటి పాత విధానంలో సంగీతం అందించనున్నాం. అలాగే చిత్రాన్ని డాల్పి అట్మాస్‌లో చేయనున్నాం.
 
  మీ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు టాప్ రేంజ్‌లో ప్రకాశించడం గురించి?
  సినిమా అనేది రెండున్నర గంటల మ్యాజిక్. అలాంటి సినిమాలను చూడటానికొచ్చేవారిని థియేటర్లలో కూర్చోపెట్టడానికి ఏదైనా చెయ్యాలి. మనం ఎవరితోనయినా మాట్లాడాలంటే వారి కళ్లు చూసే మాట్లాడతాం. అలా నేను కళ్లు చూసే ఎంపిక చేసిన హీరోయిన్లే అమలాపాల్, లక్ష్మీమీనన్. ఈ కయల్ చిత్ర నాయికి ఆనంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఆనందికి పలు అవకాశాలు వస్తున్నాయి.
 
  మైనా, కుంకీ వరసలో కయల్ చేరుతుందా?
  కయల్ చిత్రం కచ్చితంగా మంచి పేరు సంపాదించి పెడుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు షూటింగ్ కోసం చుట్టి వచ్చాం. సిరపురింజి అడవి ప్రాంతంలోని లొకేషన్స్‌ను ఇంతకు ముందే చిత్రంలోనూ చూసి ఉండరు. బ్రహ్మాండమైన విజువల్స్ చిత్రానికి అదనపు ఆకర్షణ.
 
  ఒక చిత్రం హిట్ అవ్వగానే ఆ దర్శకుడు స్టార్స్ చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో మీరు మాత్రం నూతన తారలతోనే చిత్రాలు తీస్తున్నారే.
 నా కథలకు ఎలాంటి ఇమేజ్ లేని తారలు కావాలి, కుంకీ చిత్రంలో విక్రమ్ ప్రభును ఎంపిక చేసినప్పుడు ఆయన మావటివాడిలానే కనిపించారు. అలానే నా స్క్రిప్ట్ స్టార్స్‌కు నప్పుతుందంటే వారితోనే సినిమా చేస్తా. అలా చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.