బ్యాక్‌గ్రౌండ్‌ అలా వర్కవుట్‌ అవుతుంది

17 Jun, 2020 03:20 IST|Sakshi

నెపోటిజమ్‌ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్‌’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం...

ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండానే వచ్చి, సక్సెస్‌ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్‌గ్రౌండ్‌. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్‌ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్‌గ్రౌండ్‌ ఉండి ఉంటే రాజశేఖర్‌గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని.

అయితే బ్యాక్‌గ్రౌండ్‌ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా వర్కవుట్‌ అవుతుందంటే.. ఫస్ట్‌ సినిమా సక్సెస్‌ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్‌ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌ లేనివాళ్లకు ఆ చాన్స్‌ తక్కువ. టాలెంట్‌ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్‌ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్‌లైన్స్‌తో చాన్స్‌ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మా సపోర్ట్‌ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు.
– నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్‌

శివాని, జీవిత,శివాత్మిక

నా గాయాలు చాలా లోతైనవి
హీరోగా కొన్ని చిత్రాలు, విలన్‌గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్‌ రాజ్‌ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్‌ అటు నార్త్‌కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్‌ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్‌ అడుగుతున్నాను’’ అని ట్వీట్‌ చేశారు ప్రకాశ్‌ రాజ్‌.

– నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్‌ రాజ్‌

మాకు రెడ్‌ కార్పెట్‌ ఉంటుంది కానీ...
విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న మాకు రెడ్‌ కార్పెట్‌ ఉంటుంది.  మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్‌ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్‌ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్‌ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు.

కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్‌ చాన్స్‌ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా.

– నటి, నిర్మాత లక్ష్మీ మంచు

బ్యాక్‌గ్రౌండ్‌ లేనివాళ్లూ సక్సెస్‌ అయ్యారు
‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్‌ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. విజయ్‌ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్‌గ్రౌండ్‌ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లంతా సక్సెస్‌ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న చాలామంది ఫెయిల్యూర్‌లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం.

– దర్శకురాలు నందినీ రెడ్డి

– డి.జి.భవాని

>
మరిన్ని వార్తలు