జీతాలను ముందుగానే చెల్లించేశా!

24 Mar, 2020 00:13 IST|Sakshi
ప్రకాష్‌రాజ్‌

కరోనా వైరస్‌ జనజీవనాన్ని తారుమారు చేసింది. ముఖ్యంగా దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంది. కొందరు సినిమా తారలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తన సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించానని పేర్కొన్నారు నటుడు ప్రకాష్‌రాజ్‌. ‘‘జనతా కర్ఫ్యూ రోజు నా మనసులో చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. నా నగదు నిల్వను ఓసారి పరిశీలించుకున్నాను.

నా ఇల్లు, ఫార్మ్‌హౌస్, ఫిల్మ్‌ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారితో పాటు నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకునే కార్మికుల గురించి ఆలోచించాను. కరోనా మహ మ్మా రితో పాటిస్తున్న సామాజిక దూరం మూలంగా చిత్రీకరణలు అన్ని నిలిచిపోయాయి. నా సినిమాల దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇంకా నా శక్తి మేరకు చేస్తాను. అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ సహాయం అవసరమైన వారిని ఆదుకోండి. ఒకరి జీవితాన్ని మీరు నిలపగలిగే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’’ అని సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు ప్రకాష్‌ రాజ్‌.

మరిన్ని వార్తలు