రాహుల్‌కు మద్దతుగా రంగంలోకి ప్రకాష్‌ రాజ్‌

9 Mar, 2020 17:50 IST|Sakshi

సాక్షి, హైదరబాద్‌ : సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌కు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మద్దుతగా నిలిచారు. ఇటీవల గచ్చిబౌలిలోని ప్రిజమ్‌ పబ్‌లో రితేశ్‌రెడ్డితోపాటు మరికొందరు రాహుల్‌పై బీర్‌ సీసాలతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తనకు న్యాయం చేయాల్సిందిగా రాహుల్‌.. సోషల్‌ మీడియా వేదికగా ఇదివరకే మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పలువురు సింగర్లు కూడా రాహుల్‌కు న్యాయం జరగాలని సోషలో మీడియాలో పోస్ట్‌లు చేశారు. తాజాగా రాహుల్‌ను ప్రకాష్‌ రాజ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ వద్దకు తీసుకువచ్చారు. సోమవారం అసెంబ్లీలో వినయ్‌భాస్కర్‌తో ప్రకాష్‌ రాజ్‌, రాహుల్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పబ్‌లో రాహుల్‌పై జరిగిన దాడి గురించి ప్రకాష్‌ రాజ్‌.. వినయ్‌ భాస్కర్‌తో చర్చించినట్టుగా సమాచారం. 

అనంతరం ప్రకాష్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌కు అన్యాయం జరిగిందన్నారు. రాహుల్‌ వెంట తను ఉంటానని చెప్పారు. పబ్‌లో జరిగిన గొడవలో రాహుల్‌ తప్పేమీ లేదని.. ఇందుకు సంబంధించి పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని అన్నారు. రాహుల్‌ తప్పేమీ లేనప్పుడు కాంప్రమైజ్‌ ఎందుకు కావాలని ప్రశ్నించారు. తన వ్యక్తిగత పని మీద వినయ్‌ భాస్కర్‌ను కలవడానికి వచ్చానని తెలిపారు. పబ్‌కు వెళ్లడం తప్పు కాదని.. పబ్లిక్‌ ప్లేస్‌లో 10 మంది కలిసి ఒక్కరిని కొట్టడం దారుణం అన్నారు. సినిమా వాళ్లయితే చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, రాహుల్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 324, 34 రెడ్‌విత్‌, 354 సెక్షన్ల కింద రితేష్‌రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో రాహుల్‌ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : సీసీటీవీ ఫుటేజ్‌ షేర్‌ చేసిన రాహుల్‌

వైరల్‌ : పునర్నవితో రాహుల్‌ సందడి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు