నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!

16 Jun, 2020 14:07 IST|Sakshi

నెపోటిజంపై  ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు

ఇకనైనా నిలబడదాం! కలలను కాపాడుకుందాం!!

సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) అకాల మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సుశాంత్ అభిమానులు, సినీ ప్రముఖులు, ఇతర పెద్దలు, సుశాంత్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాజాగా ప్రముఖ నటుడు  ప్రకాశ్ రాజ్  ట్విటర్ లో స్పందించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో పాతుకు పోయిన నటవారసత్వంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన గాయాలు చాలా లోతైనవని (నా గాయాలు నా మాంసం కన్నా లోతు) గుర్తు చేసుకున్నారు. అయినా నిలదొక్కుకున్నాను. కానీ పాపం.. పిల్లవాడు (సుశాంత్) వల్ల కాలేదు. తట్టుకోలేకపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇకనైనా నేర్చుకుందామా.. వారి కలలు కల్లలు కాకుండా నిలబడదామా.. అంటూ ఉద్వేగ భరిత పోస్ట్ పెట్టారు. (సుశాంత్ అంత్య‌క్రియలు: న‌టుడి భావోద్వేగ పోస్ట్‌)

ఈ సందర్భంగా కెరీర్ ఆరంభంలో ఎదురైన నెపోటిజం గురించి ప్రస్తావిస్తున్న సుశాంత్ వీడియోను కూడా ప్రకాశ్ రాజ్ షేర్ చేశారు. ఈ వీడియోలో 2017లో జరిగిన ఐఫా కార్యక్రమంలో తన ఆలోచనలను సుశాంత్ పంచుకున్నారు. నెపోటిజం సమస్య ప్రతిచోటా ఉంది. కానీ నిజమైన ప్రతిభకు ప్రోత్సాహం లభించకపోతే ఏదో ఒక రోజు మొత్తం పరిశ్రమ నిర్మాణం కుప్పకూలిపోతుందని సుశాంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.

కాగా గత ఆరు నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు ప్రశ్నల్ని లేవనెత్తిన సంగతి  తెలిసిందే.
 

మరిన్ని వార్తలు