అప్పుడు విజయగర్వం తలకెక్కింది..కానీ

22 May, 2019 20:49 IST|Sakshi

తన చివరి శ్వాసదాకా నటిస్తూనే ఉంటానని ‘జానే తూ యా జానే నా’ ఫేం ప్రతీక్‌ బబ్బర్‌ పేర్కొన్నాడు. 2008లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ స్టార్‌ కిడ్‌..ఏఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న.. ‘దర్బార్‌’ సినిమాలో విలన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు. ఈ విషయం గురించి ప్రతీక్‌ మాట్లాడుతూ..‘ గొప్ప దర్శకులతో పని చేయడం, మంచి క్యారెక్టర్లు దక్కించుకోవడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. బయట ఎంతో మంది వ్యక్తులు ఇటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు దక్కుతాయి’ అని పేర్కొన్నాడు.

తన కెరీర్‌ తొలినాళ్ల గురించి గుర్తు చేసుకుంటూ.. ‘ 19 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పుడు అసలు నటన అంటే ఏంటో తెలియదు. సెట్స్‌కి వెళ్లినపుడు ఒక పెయిడ్‌ హాలీడేలా అనిపించేది. నటిస్తే పాకెట్‌ మనీ వస్తుంది... దాంతో స్నేహితులతో సరదాగా గడుపవచ్చని అనుకునేవాడిని తప్ప నటనను సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చిన్నతనంలో సెలబ్రిటీ కావడంతో గర్వం నా తలకెక్కింది. కానీ ఇప్పుడు నటనే నా ప్రాణంగా మారింది. సక్సెస్‌కు ఉన్న విలువ తెలిసింది. ఇన్నాళ్ల ప్రయాణంలో వ్యక్తిగా కూడా ఎంతో పరిణతి చెందాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది తన స్నేహితురాలు సన్యా సాగర్‌తో ప్రతీక్‌ పెళ్లి జరిగింది.  లక్నోలో మరాఠీ- హిందూ సంప్రదాయ పద్ధతుల్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మరిన్ని వార్తలు