13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ తీసుకున్నా : యంగ్ హీరో

12 Aug, 2017 11:19 IST|Sakshi
13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ తీసుకున్నా : యంగ్ హీరో

ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న ప్రదానాంశం డ్రగ్స్. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ విషయంలో విచారణను ఎదుర్కొనగా మరికొంత మందికి ఈ విషయంలో ప్రమేయం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ నటుడు డ్రగ్స్ వినియోగం పై స్పందించాడు. లెజెండరీ యాక్టర్స్ రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ ల కుమారుడు ప్రతీక్ బబ్బర్ ఏక్ దివానా థా సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.

ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతీక్ ' రాజ్ బబ్బర్, స్మితా పాటిల్ లాంటి లెజెండ్ కడుపున పుట్టానే గాని, జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందరికీ నేను ప్రతీక్‌ బబ్బర్‌లాగే తెలుసు. కానీ నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియదు. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను. కానీ ఇప్పుడు మనిషిగా వాటన్నింటినీ జయించాను. డ్రగ్స్‌ జీవితం ఎలా నాశనమవుతుంది? వాటి నుంచి ఎలా బయటపడాలి? అన్న విషయాలు మీతో పంచుకుంటున్నా...

13 ఏళ్ల వయసులో ఏదో తెలియని బాధతో ఇబ్బంది పడేవాడిని. సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు వేదించేవి. దీంతో నా మనసు డ్రగ్స్‌వైపు మళ్లింది. ఎలాంటి డ్రగ్ అయినా ఆలోచించకుండా వాడేవాడిని. ఒక దశలో పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ గా మారిపోయా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను వేలెత్తి చూపుతారిని భయపడేవాడిని, నన్ను నేను కూడా చూసుకునేందుకు భయపడేవాడిని. మానేయాలన్న ఆలోచన వచ్చినా.. నా వల్ల అయ్యేది కాదు. చివరకు డాక్టర్లు నా సమస్యకు పరిష్కారం చూపించారు. జీవితం నాశనం చేసుకోవటం కన్నా.. కష్టపడి డ్రగ్స్ వాడకాన్ని మానేయటం కరెక్ట్' అంటూ తన అనుభవాలను అభిమానులకు వివరించాడు ప్రతీక్ బబ్బర్.