మెగా ఫ్యాన్స్‌ మద్దతుతో ప్రతిరోజూ పండగే

26 Dec, 2019 13:27 IST|Sakshi
ప్రతిరోజూ పండగే విజయోత్సంలో చిత్రయూనిట్‌ దర్శకుడు మారుతి, హీరో సాయిధరమ్‌ తేజ్, నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాస్, రావురమేష్, భద్రం తదితరులు

నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇది : సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌

రాజమహేంద్రవరంలో ఘనంగా చిత్ర విజయోత్సవ కార్యక్రమం

తూర్పుగోదావరి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ‘‘ఆరు సినిమాలు వరుసగా ప్లాప్‌ కాగానే నా కెరీర్‌ అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయినా మెగా ఫ్యాన్స్‌ మద్దతుతో ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ తన కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అయ్యింది’’ అని ఆ చిత్ర హీరో సాయిధరమ్‌తేజ్‌ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం కళాకేంద్రంలో సాయి ధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి వచ్చానన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు మారుతి తనకు మంచి విజయాన్ని అందించారన్నారు. చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ తాను కృష్ణా జిల్లాలో పుట్టినా గోదావరి జిల్లాలతో తెలియని అనుబంధం ఉందన్నారు.

కథ రాసేటప్పుడు రాజమండ్రిలో చిత్ర షూటింగ్‌ చేయాలని అనుకున్నామన్నారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో చాలా మంది తమ తల్లిదండ్రులను మిస్సవుతున్నారన్న కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తీశామన్నారు. థియేటర్‌లో నవ్వించడంతో పాటు హృదయాన్ని హత్తుకునేలా మంచి మేసేజ్‌ ఇచ్చారని ప్రేక్షకులు అంటున్నారన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ దర్శకుడు మారుతి, హీరో సాయిధరమ్‌తేజ్‌లు ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందించారన్నారు. తాత పాత్రలో సత్యరాజ్, తండ్రి పాత్రలో రావు రమేష్‌ అద్భుతంగా నటించారన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ చిత్రాన్ని 60 శాతం రాజమహేంద్రవరంలో షూట్‌ చేశామన్నారు. సినిమా అయిపోయిన తరువాత థియేటర్ల నుంచి బయటకు వచ్చే సమయంలో కొడుకులు వారి తల్లిదండ్రుల చేతులు పట్టుకుని బయటకు రావడం కనిపించిందన్నారు. నటుడు రావు రమేష్‌ మాట్లాడుతూ సినిమాలో తనకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన దర్శకుడు మారుతికి తన తల్లి ఉంటే గుడి కట్టేదని అన్నారు. సినిమాలోని తన డైలాగులను చెప్పి కొద్ది సేపు నవ్వించారు. కమెడీయన్‌ భద్రం మాట్లాడుతూ రాజమహేంద్రవరం వాసినైన తనకు మంచి గుర్తింపు పాత్రలను ఇచ్చి దర్శకుడు మారుతి ప్రోత్సహించారన్నారు. థియేటర్‌లకు వెళితే నవ్వించడం కష్టమైపోతున్న రోజుల్లో దర్శకుడు మారుతి మంచి పాయింట్, కాన్సెప్ట్‌తో నవ్వులతో పాటు ఎమోషన్స్‌ను పండించారన్నారు. నటులు అజయ్, సత్యం రాజేష్, సుహాస్, శ్రీకాంత్‌ మాట్లాడారు.

అల్లు అరవింద్‌ నిర్మాత కావడం అదృష్టం: జక్కంపూడి రాజా
చిత్రసీమలో అల్లు అరవింద్‌ నిర్మాతగా ఉండడం తెలుగు రాష్ట్రాల ప్రజలు అదృష్టంగా భావిస్తున్నామని రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ప్రతిరోజూ పండగే విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అల్లు అరవింద్‌ సక్సెస్‌ఫుల్‌ నిర్మాత అని కొనియాడారు. హీరో సాయిధరమ్‌తేజ్‌ అంతే తనకు ఎంతో అభిమానమని, వీవీ వినాయక్‌ దర్శకత్వంలో సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ రాజమండ్రిలోనే జరిగిందని, ఇప్పుడు ప్రతిరోజూ పండగే విజయోత్సవం ఇక్కడ జరుగుతుందన్నారు. తన తండ్రి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకునేవారని, వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, వంగవీటి మోహన్‌రంగాలైతే మూడో వ్యక్తి మెగాస్టార్‌ చిరంజీవి అని అన్నారు. చిరంజీవి సినిమా రిలీజైతే చాలు మంత్రిగా ఉన్న సమయంలో బెనిఫిట్‌ షో చూసేవారన్నారు. కడియంలో వేదికపై దివంగత పద్మశ్రీ అల్లురామలింగయ్యను సత్కరించామని, త్వరలోనే రాజమహేంద్రవరంలో అల్లు అరవింద్‌ను సత్కరించే అవకాశం ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు. రాజమహేంద్రవరానికి చెందిన నటుడు భద్రంను చిత్రసీమ అంతా భద్రంగా చూసుకోవాలని కోరారు. శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, సత్య డాన్స్‌ ట్రూప్‌ సాయిధరమ్‌తేజ్‌ చిత్రాల్లోని పాటలకు స్టెప్పులు వేసి అలరించారు.

మరిన్ని వార్తలు