ప్రత్యూషది హత్య కేసు అయ్యే అవకాశం?

7 Apr, 2016 14:40 IST|Sakshi
ప్రత్యూషది హత్య కేసు అయ్యే అవకాశం?

ముంబై: ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతికేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ముంబై కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రాహుల్‌ కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ప్రత్యూష కుటుంబం తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ప్రత్యూష కేసు హత్యకేసు అయ్యే అవకాశముందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని జడ్జికి విజ్ఞప్తి చేశారు. దీంతో బెయిల్ ఇవ్వడం లేదంటూ జడ్జి కేఎఫ్ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు.

బెయిల్‌ కోసం ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు ప్రత్యూషది నూటికి నూరుపాళ్లు హత్యేనని, ఈ కేసులో రాహుల్‌ను తీవ్రంగా శిక్షించాలని ఆమె తల్లి డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినట్టు రాహుల్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక రాహుల్‌ గతంలో కూడా పలువురు మహిళలను మోసం చేసినట్టు తెలుస్తోంది. అతడు తమను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేశాడని టీవీ పరిశ్రమకు చెందిన హీర్ పటేల్‌, కేశా కంభాటితోపాటు మరో మహిళ ఆరోపించారు. రాహుల్ వలలో చిక్కి మోసపోయిన మహిళలు డజను వరకు ఉంటారని వారు చెప్పారు.