బంగారు కలలు కందాం...

28 Feb, 2016 22:56 IST|Sakshi
బంగారు కలలు కందాం...

 ‘థీమ్ పార్టీ’ గురించి వినే ఉంటారు. ఇలాంటి పార్టీలకు ఓ డ్రెస్ కోడ్ నిర్ణయిస్తారు. ఎలాంటి వేషధారణలో రావాలో కూడా ముందే చెప్పేస్తారు. ఆదివారం సాయంత్రం (భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకను ‘వియ్ ఆల్ డ్రీమ్ ఇన్ గోల్డ్’ అనే థీమ్‌తో నిర్వహించారు. ‘బంగారు బొమ్మను సొంతం చేసుకోవడానికి బంగారు కలలు కందాం’ అంటూ నామినేషన్ దక్కించుకున్నవాళ్లు ఇన్నాళ్లూ కలలు కన్నారు. మరి.. ఎవరి కల నిజమయ్యిందనేది సోమవారం తెలిసిపోతుంది. ఈలోపు ఆస్కార్ అవార్డుల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం...
 
 మెరుపు తీగలను దగ్గరగా చూడ్డానికి పోటీ!
 ఆస్కార్ అవార్డు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విషయాల్లో రెడ్ కార్పెట్ ఒకటి. ఎర్ర తివాచీ పై అందాల తారలు వయ్యారంగా నడుస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఈ క్యాట్‌వాక్‌ని దగ్గరగా చూడ్డానికి చాలామంది పోటీలు పడుతుంటారు. అందుకే, రెడ్ కార్పెట్‌కి సమీపంగా ఉన్న పోడియమ్‌కి వెళ్లే చాన్స్ దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతారు. అందులో 745 మంది ఆసీనులు కావచ్చు. దీనికోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్లకే ఈ అవకాశం దక్కుతుంది. వీరికి లోపల జరిగే అవార్డు కార్యక్రమాన్ని వీక్షించే అనుమతి మాత్రం ఉండదు. అయి నప్పటికీ పోడియమ్‌లో చోటు కోసం ఆన్‌లైన్‌లో వేల సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయట.
 
 ఎక్కువ మాట్లాడితే... మైక్ కట్!
 ... అండ్ ది విన్నర్ ఈజ్ అంటూ తమ పేరు వినగానే విజేతల గుండె లయ తప్పినట్లు అవుతుంది. ఒకింత ఉద్వే గంగా, కన్‌ఫ్యూజన్‌గా వేదిక మీదకు వస్తారు. ఆ కంగారులో ఎక్కువ మాట్లాడేయాలనుకుంటారు కొంతమంది. కానీ, కేవలం 45 సెకండ్లు మాత్రమే విజేతకు టైం ఇస్తారు. అందుకే నామినేషన్ దక్కించుకున్నవాళ్లు ముందుగానే రిహార్సల్ చేస్తారు. అయినప్పటికీ ఉద్వేగంలో 45 సెకండ్లు కన్నా ఎక్కువ మాట్లాడితే...? మైక్రో ఫోన్‌ను కట్ చేస్తారు.
 
 ఆనాటి ఆనవాళ్లు!
 ఆస్కార్ వేదిక అంటే అంగరంగ వైభవంగా ఉంటుంది. ఈసారి వేదిక విశేషం ఏంటంటే.. 1970ల నాటి హాలీవుడ్ చిత్రాలను తలపించేలా ఉంటుందట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కాబట్టి, వేదికను అలా డిజైన్ చేశారు. ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ.. ‘వియ్ ఆల్ డ్రీమ్ ఇన్ గోల్డ్’ అనే  థీమ్‌తో ఈ వేడుక జరపాలనుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆస్కార్ వేదికను డి జైన్ చేస్తున్న డెరిక్ మెక్లెయిన్ ఈసారి కూడా వేదికను డిజైన్ చేశారు.
 
 ముస్తాబుకు అంత ఖరీదా!

 అందాల తారలు రెడ్ కార్పెట్‌పై రకరకాల డ్రెస్సుల్లో చూపరుల మతులు పోగొడతారు. వీళ్లు వేసుకునే దుస్తులు, ఆభరణాలు, కేశాలంకరణ, మేకప్.. అన్నింటికీ కలిపి ఒక్కో బ్యూటీకి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షల రూపాయలట. అంత ఖర్చుపెడతారు కాబట్టే, కనువిందు చేయగలుగుతున్నారు.
 
 ఆ చానల్‌కి  కాసుల పంట!
 ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఏబీసీ చానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గత 50 ఏళ్లుగా ఇదే చానల్ ఆస్కార్ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ ప్రసార హక్కులు దక్కించుకోవడానికి దాదాపు 520 కోట్ల రూపాయలను సదరు చానల్‌వారు వేడుక నిర్వాహకులకు ఇస్తారట. ఆ డబ్బుని యాడ్స్ రూపంలో సునాయాసంగా వసూలు చేసేసుకుంటారు. ప్రత్యక్ష ప్రసారం మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌కి దాదాపు 12 నుంచి 13 కోట్ల రూపాయల వరకూ తీసుకుంటారని భోగట్టా. 2020 వరకూ ఈ కార్యక్రమాన్ని తమ చానల్ వారే ప్రసారం చేసేలా ఆస్కార్ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుంది ఏబీసీ. ఈ చానల్ ద్వారా 225 దేశాల్లో ఆస్కార్ అవార్డుల పండగ వీక్షకులను కనువిందు చేయనుంది.
 
 లంచ్ మీట్‌లో సందడి
 నామినేషన్స్‌ని ప్రకటించిన తర్వాత నామినీస్‌కి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ లంచ్‌లో పాల్గొనడానికి వచ్చే నామినీస్ అందంగా ముస్తాబై హాజరవుతారు. ఈ మధ్య జరిగిన లంచ్ మీట్‌లో లియొనార్డో డికాప్రియో, స్టీవెన్ స్పీల్‌బర్గ్, జెన్నిఫర్ లారెన్స్, సీర్షా రొనాన్,  రేషెల్ మెక్ ఆడమ్స్, లేడీ గగా తదితరులు పాల్గొని, సందడి చేశారు.
 
 అమెరికానే నా దగ్గరకు వచ్చింది: ప్రియాంకా చోప్రా
 ఆస్కార్ వేడుకల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేసే అవకాశం మన భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు దక్కిన విషయం తెలిసిందే. రిహార్సల్స్ చేయడం కోసం రెండు రోజుల క్రితమే ఆమె లాస్ ఏంజిల్స్ వెళ్లారు. ‘‘జుత్తుకు హెన్నా పెట్టుకోమని, నోస్ రింగ్ పెట్టుకోమని.. ఇలా చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు. ఎలా మ్యానేజ్ చేస్తావో.. ఏంటో అని కంగారుపెట్టారు. నేను కూల్‌గానే ఉన్నా’’ అని ప్రియాంక అన్నారు.
 
 ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ఒప్పుకున్నప్పుడు అమెరికాలో నేనేంటో నిరూపించుకోవాలనే ప్లాన్ నాకుందని చాలామంది అనుకున్నారు. నాకలాంటి ప్లాన్స్ ఏవీ లేవు. అమెరికానే ఓ అవకాశం తీసుకుని నా దగ్గరకు వస్తే, నేను ఒప్పుకున్నాను... అంతే. నేను అమెరికన్ ఇండియన్‌ని కాదు. ఎప్పటికీ ‘ఇండియన్ ఇండియన్’నే’’ అన్నారు. ఆస్కార్ వేడుకలో అందర్నీ ఆకట్టుకోగలననే ధీమా ఆమెలో కనిపించింది.