కనడం మన చాయిస్‌

6 Aug, 2018 00:50 IST|Sakshi

హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ అనిస్టన్‌ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘‘పిల్లల విషయంలో నా గురించి చాలా కామెంట్స్‌ చేస్తున్నారు. యాక్టింగ్‌ కెరీర్‌ కోసం నేను పిల్లల్ని కనడం లేదని, నా అందం పాడైపోతుందని పిల్లల్ని వద్దనుకుంటున్నానని ఇలా నొటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిల్లల్ని కనడం కోసమే నేను ఈ భూమ్మీదికి రాలేదు. అంతకుమించిన లక్ష్యాలుంటాయి. వాటి కోసం వచ్చాను. నాకే కాదు, ఏ స్త్రీ జీవిత పరమార్థం కూడా పిల్లల్ని కనడమే కాదు. కాబట్టి పిల్లల్లేని ఆడవాళ్లను పనికిరాని వస్తువులుగా చూడకండి’’ అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడింది. ఇప్పుడు బాలీవుడ్‌ నటి, కమర్షియల్‌ పైలట్‌ గుల్‌ పనాగ్‌.. పిల్లల విషయంలో స్త్రీలకు మరో విధంగా సలహా ఇచ్చింది. ‘‘పిల్లల్ని పెంచడానికి మానసికంగా సంసిద్ధమైనప్పుడే కనండి. అంతే తప్ప సమాజం కోసమో, బయోలాజికల్‌ సైకిల్‌ గురించి ఆలోచించో.. భయపడో కనొద్దు’’ అని. ముప్పైతొమ్మిదేళ్ల గుల్‌పనాగ్‌ ఆర్నెల్ల కిందట మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఆమె భర్త రిషి అత్తారి జెట్‌ ఎయిర్‌వేస్‌ కెప్టెన్‌.

‘వియ్‌ ఆర్‌ ప్రెగ్నెంట్‌’  
‘‘పిల్లల కోసం మేము తొందరపడలేదు. ఆర్థికంగానే కాదు.. మానసికంగా కూడా ఓకే అనుకున్నప్పుడు.. పిల్లలకు  ఏ లోటు రాకుండా పెంచగలం అని అనుకున్నప్పుడే నేను పిల్లల కోసం ప్లాన్‌ చేసుకున్నాను. అప్పటికి నాకు 39 ఏళ్లు. అయినా అన్నాళ్లు నేను నా దేహధర్మాల గురించి దిగులుపడలేదు. పిల్లలను కనడం, పెంచడం విషయంలో భార్యాభర్తలు ఇద్దరికీ అవగాహన ఉండాలి. బాధ్యతల్లో పాలుపంచుకోవాలి. భార్య మాత్రమే ప్రెగ్నెంట్‌ అని అనుకోవద్దు.. వియ్‌ఆర్‌ ప్రెగ్నెంట్‌ అని భర్త అనుకోవాలి. నిహాల్‌ (కొడుకు) ప్రిమెచ్చూర్‌ బేబీ. అయినా వాడిని పెంచే విషయంలో నేనేం భయపడలేదు. డాక్టర్ల సలహాతో నేను, రిషి ఇద్దరం పూర్తి సమయాన్ని వాడికే కేటాయించాం. ఉద్యోగాలు చేసే భార్య, భర్త కూడా పిల్లల పెంపకం విషయంలో సమానబాధ్యతలు తీసుకోవాలి. తల్లి అయిన భార్య మానసిక స్థితిని భర్త అర్థం చేసుకోవాలి. అటెన్షన్‌ ఇవ్వాలి. సో... పిల్లలు లేరని సమాజం ఏదో అంటుందని తొందరపడి పిల్లలను కనొద్దు. వాళ్ల ఆలనాపాలనాలో ఉన్న ఆనందాన్ని మిస్‌ చేసుకోవద్దు’’ అని తన అభిప్రాయాన్ని చెప్పారు గుల్‌పనాగ్‌. 

మరిన్ని వార్తలు