మన్నించండి!

21 Nov, 2018 00:24 IST|Sakshi

‘మీటూ’ ఉద్యమంపై నటి ప్రీతీ జింతా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా... ‘మీరు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా?’ అన్న ప్రశ్నను ఆమెను అడిగినప్పుడు– ‘‘నా కెరీర్‌లో లైంగింక వేధింపులను ఎదుర్కొనలేదు. నాకూ అలా జరిగితే ఈ ప్రశ్నకు ఆన్సర్‌ దొరికేది. అయినా మన ప్రవర్తనను బట్టే ఇతరుల ప్రవర్తన ఉంటుంది. కొందరు మహిళలు పబ్లిసిటీ కోసం, మరికొందరు వ్యక్తిగత ప్రతీకారం కోసం ‘మీటూ’ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని అర్థం వచ్చేలా మాట్లాడటంతో పాటు ‘మీటూ’ ఉద్యమం ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె నవ్వారట. దీంతో ఆమె తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురిసింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన ప్రీతీ తాను ఇచ్చిన ఇంటర్వ్యూను సరిగ్గా ఎడిట్‌ చేయలేదని, తన మాటలను అపార్థం చేసుకున్నారని స్పందించారు.

అయినప్పటికీ విమర్శలు తగ్గకపోవడంతో ఆమె ఓ లాంగ్‌ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌ సారాంశం ఇలా ఉంది. ‘‘మీటూ’ ఉద్యమం గురించి బయటికి వచ్చి మాట్లాడిన మహిళల మనోభావాలు దెబ్బ తినేలా నా వ్యాఖ్యలు ఉంటే మన్నించండి. మొదట్నుంచి ‘మీటూ’ ఉద్యమానికి నేను మద్దతిస్తున్నాను. దురదృష్టవశాత్తు నా మాటలు తప్పుగా వినిపించాయి. వైరల్‌ అయిన ఇంటర్వ్యూలో ‘‘నాకు జరిగి ఉంటే చెప్పేదాన్ని అనే మాటకు అర్థం ఏంటంటే.. ‘నన్ను వేధించినట్లయితే వెంటనే రియాక్ట్‌ అయ్యుండేదాన్ని. వారి చెంప చెళ్లుమనిపించేదాన్ని’ అని. అలాగే  నా నవ్వుకు కారణం అదొక ఇంటర్వ్యూ, నేనూ మూవీ ప్రమోషన్‌ చేస్తున్నాను. అందుకే నవ్వుతూ మాట్లాడాను. ఇక ‘మీటూ’ గురించి చెప్పాలంటే.. మహిళల హక్కుల గురించి చాలాసార్లు మాట్లాడిన నేను ఇప్పుడు ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. భవిష్యత్‌లో మహిళలు మరింత నమ్మకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే.. మహిళలు ఒకరికి ఒకరు సపోర్ట్‌ చేసుకోకపోతే అప్పుడు ఉద్యమం ఉండదు. ఈ ఉద్యమానికి పురుషులు సపోర్ట్‌ చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రీతీ జింతా పేర్కొన్నారు.  

 

మరిన్ని వార్తలు