ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది?

26 May, 2014 01:04 IST|Sakshi
ప్రేమలో పడ్డాక ఏం జరుగుతుంది?

ప్రేమ చాలా మధురంగా ఉంటుంది? అని ఎవరైనా ఆ యువకుడితో అంటే ఇంతెత్తున విరుచుకుపడతాడు. అబ్బాయిలను తమ చుట్టూ తిప్పుకుని, వాళ్ల కెరీర్‌తో ఆడుకోవడంతో పాటు, పర్సులను కూడా అమ్మాయిలు ఖాళీ చేస్తారని అతని అభిప్రాయం. ప్రేమపై అంత దురభిప్రాయం ఉన్న ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్‌తా నయ్’. ఇండియన్ ఐడల్ శ్రీరామ్‌చంద్ర హీరోగా మద్దాల భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. సుబ్బు ఆర్వీ దర్శకుడు. చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ - ‘‘వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. శ్రీరామచంద్రకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చే చిత్రం అవుతుంది. మణిశర్మ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు.