తొలిప్రేమ రెపరెపలు

6 Dec, 2017 00:53 IST|Sakshi

సీసాలో బంధించలేని భూతం ఒకటి ఉంది– ప్రేమ. పది దాటి, పదకొండు దాటి, పన్నెండు దాటి, పదమూడు తగిలాక, పద్నాలుగు నిండాక, పదిహేను పండాక, పదహారు పలకరించాక ఈ భూతం పట్టుకుంటుంది.
ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో... ఎవరికి ప్రత్యక్షం చేయిస్తుందో.సకల లోకం ఈ కథను వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకమ్మాయి.. ఒకబ్బాయి... వాళ్లిద్దరూ కలిశారు. తర్వాత ఏమైంది.అందరికీ ఇదే ఇంట్రెస్ట్‌.మానవజాతి ఉన్నంత వరకు ఈ కథ ఉంటుంది.

‘ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించింది నిజమైతే, ఆ అబ్బాయి మీద నీ ప్రేమ అంత స్వచ్ఛమైనదే అయితే ఇద్దరూ ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉండాలి’ అని గతంలో కె.బాలచందర్‌ ‘మరో చరిత్ర’లో ఒక చిత్రమైన ప్రేమ పందేన్ని చూపిస్తారు. ‘ప్రేమ పావురాల్లో’ కూడా ఒక ప్రేమ పందెం ఉంది. ‘నువ్వు నా కూతురిని ప్రేమించింది నిజమే అయితే నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే ఒక నెలలో రెండు వేల రూపాయలు సంపాదించి చూపించు’ అంటాడు అమ్మాయి తండ్రి.అబ్బాయి సరేనంటాడు. అది ఇవాళ కాదు. 1989లో.రెండు వేల రూపాయలంటే గెజిటెడ్‌ ఆఫీసర్‌కు కూడా అంత నెల జీతం లేదు. కొండ ప్రాంతంలో రాళ్లు కొట్టే పని తప్ప వేరే ఏమీ లేని చోట నెలకు రెండు వేల రూపాయల కష్టార్జితం చూపించి తన ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు అబ్బాయి. ఆ పని ఎలా చేస్తాడో చూద్దామని ప్రేక్షకులకు కుతూహలం కలిగింది.ఆ కుతూహలం సక్రమంగా తీరే సరికి సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. 2 కోట్లతో సినిమా తీస్తే 28 కోట్లు వచ్చాయి.ఇవాళ్టి డబ్బుతో సమానం చేస్తే దాదాపు 450 కోట్లు.గ్రాఫిక్సు గుర్రాలు ఏళ్ల తరబడి మేకింగ్‌ లేకుండా ఆరు నెలల్లో తీసి కథతో సాధించిన ప్రేమ బాహుబలి రికార్డు అది. ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు.


సాధారణంగా హీరోయిన్‌ రాజకుమారి అయి ఉంటుంది. హీరో పేదవాడు అయి ఉంటాడు. కాని ఈ సినిమాలో రివర్స్‌. హీరో రాజకుమారుడు. హీరోయిన్‌ మామూలు అమ్మాయి. కాని ఆత్మాభిమానం కలిగినది. తండ్రి దుబాయ్‌ వెళుతూ వెళుతూ ఆమెను స్నేహితుడి ఇంట్లో వదిలి పెడితే ఆ స్నేహితుని కుమారుడి మనసు గెలుచుకుంటుంది. చక్కటి రూపం, మాట తీరు, సంస్కారం... ఇవన్నీ ఉన్న అమ్మాయిని ఎవరు వదలుకుంటారు? కాని ఇందులో తండ్రీ కూతుళ్ల కుట్ర ఉందని అబ్బాయి తండ్రి అనుమానిస్తాడు. ఆ మాటే చెప్పి స్నేహితుడని కూడా చూడకుండా అమ్మాయి తండ్రిని గాయపరుస్తాడు. కూటికి పేద కావచ్చు కాని ఆత్మగౌరవానికి కాదు. నీ దగ్గర డబ్బుంటే వెయ్యి సార్లు తిను వందసార్లు ఊరేగు... కాని డబ్బుంది కదా అని అవమానించకు అని అతడు తన కూతురిని తీసుకుని ఊరికి వచ్చేస్తాడు. వెతుక్కుంటూ వచ్చిన అబ్బాయిని ‘నీ తండ్రి సంపాదన లేకపోతే నువ్వు నిండు సున్నాతో సమానం’ అని రెచ్చ గొడతాడు. నెలకు రెండు వేలు సంపాదించి చూపించు అని సవాలు విసురుతాడు.
ప్రేమ కోసం మనసు పడిన పసివాడు రాచరికాన్ని వదిలి కూలివాడిగా మారతాడు. రాళ్లు కొడతాడు. నీళ్లల్లో తడుస్తాడు. చివరకు తన ప్రేమ సాధించుకుంటాడు. గెలిచిన ప్రేమకు ఎప్పుడు ప్రజల హర్షం ఉంటుంది. ఆ హర్షం కలెక్షన్ల రూపంలో వచ్చింది.


కథ పెద్దగా ఏమీ లేకుండా కథా సంవిధానంతో కథ నడపడం ఈ సినిమాతో మొదలైంది. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ అంతా అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు పలకరించుకోవడమే. అదీ చాలా కొత్త సీన్లతో. ఫ్రెష్‌ సీన్లతో. అబ్బాయి అమెరికా నుంచి హడావుడిగా వచ్చి బాత్‌రూమ్‌లో ‘సుసూ’ చేస్తూ చాలా క్యాజువల్‌గా హీరోయిన్‌ని పలకరిస్తాడు. హీరోయిన్‌ కూడా ఉలిక్కిపడి పలకరిస్తుంది. ఇలాంటి సీన్‌ ఇంతకు మునుపు లేదు. హీరోయిన్‌ను హీరో పార్టీకి తీసుకువెళతాడు. అక్కడ హీరోయిన్‌కు అవమానం జరుగుతుంది. హీరో ప్రతాపం చూపి ‘నువ్వు నా దానివి’ అనే సూచన చేస్తాడు. ఇదీ కొత్త సీనే. అబ్బాయి ‘ఐ లవ్‌ యూ’ చెప్పాక అమ్మాయికి ‘ఐ లవ్‌ యూ’ చెప్పే వీలు ఉండదు. అది చూసి అబ్బాయి అలుగుతాడు. ఆ అలక చూసి ఏమైతే అదవుతుందని అందరి ముందే ఐ లవ్‌ యూ చెప్పడానికి అమ్మాయి ముందుకు వస్తుంది. ‘అంత్యాక్షరి’ ఆడుతూ పాట రూపంలో తన మనసులో మాట చెబుతుంది. ఇది కూడా చాలా కొత్త సీను. వీళ్లకు మీడియేటర్‌గా పావురం ఉండటం కొత్త. అప్పటి దాకా అమ్మలంటే మిషన్‌ కుడుతూ, లేదంటే కన్నీరు కారుస్తూ, ముసలి విగ్గులతో కనిపించేది. ఈ సినిమాలో హీరో తల్లి చాలా ఫ్రెండ్లీగా ఉండి ఎంతో క్యాజువల్‌గా కనిపించి నేడు ప్రతి సినిమాలో కనిపిస్తున్న ఆ తరహా తల్లుల పాత్రకు రోల్‌ మోడల్‌ అయ్యింది. ఈ పాత్రా కొత్తే. హీరో కొత్త. హీరోయిన్‌ కొత్త. దర్శకుడు కొత్త. కాని ప్రేమ మాత్రం కొన్ని యుగాలంత పాత. అందుకే ‘ప్రేమ పావురాలు’ కొన్ని దశాబ్దాలు చెప్పుకునేంత పెద్ద హిట్‌ అయ్యింది.


ముత్యపుచిప్పలు తీరమంతా పడి ఉంటాయి. అందరూ ఏరుతారు. కాని ఏ ఒక్కరికో లోపల ముత్యం దొరుకుతుంది. ప్రేమ కూడా అంతే. ఎందరో అనుకుంటారు. కాని కొందరే పొందుతారు. పెళ్లి తర్వాత ప్రేమ బాగుంటుంది అని ఎవరైనా అనొచ్చు గాక... కాని పెళ్లికి ముందు ప్రేమ, కనుల పలకరింత, దివారాత్రాల పలవరింత, మొదటిసారి చెప్పుకున్న ఐ లవ్‌ యూ మాటలు, రాసుకున్న లేఖలు, ప్రేమను ఫలవంతం చేసుకుంటూ పెళ్లి దాకా నడిచిన నడక... ఇవి పొందినవారు ధన్యులు. సాదాగా నడిచిపోయిన ప్రేమ సాదా దోసె తిన్నట్టుంటుంది. ఈ కథలోలాగా సవాలు ఎదురైతే అది కట్‌ మిర్చి. చాలా కాలం వదలని మధురమైన మిర్చీ ఘాటు– ప్రేమ పావురాలు.

మై నే ప్యార్‌ కియా
దర్శకుడు సూరజ్‌ భరజాత్యా పాతికేళ్ల వయసులో తీసిన ‘మైనే ప్యార్‌ కియా’ అతణ్ణి, అతడు పరిచయం చేసిన సల్మాన్‌ఖాన్‌ని జీవితకాలం పాటు సెటిల్‌ చేసింది. అదే సినిమాతో పెద్ద స్టారైన హీరోయిన్‌ భాగ్యశ్రీ వెంటనే సినిమాల నుంచి తప్పుకుని ఆ కాలపు కుర్రకారుకి తియ్యని కలగా మిగిలింది. ‘మైనే ప్యార్‌ కియా’ తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా విడుదలై పాతిక వారాలు ఆడటం ఒక ఘనత. ఇందులోని పాటలు చాలా పెద్ద హిట్టు. ‘దిల్‌ దీవానా బిన్‌ సజ్‌నాకే’, ‘కబూతర్‌ జా జా జా’, ‘ఆజా షామ్‌ హోనే ఆయీ’.. ఇవి హిందీతో పాటు తెలుగులో కూడా హిట్టయ్యాయి. రాజశ్రీ రచన, రామ్‌లక్ష్మణ్‌ సంగీతం, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం గానం మరువం. ఈ సినిమా సెంటిమెంట్‌తో బాలూ కొంత కాలం పాటు సల్మాన్‌ఖాన్‌ గళంగా మారారు. ఈ సినిమా ఆధారంగా కృష్ణవంశీ ‘నిన్నే పెళ్లాడతా’ తీశారు. స్నేహితుడి ఇంట్లో అమ్మాయికి బదులు అబ్బాయిని వదలిపెట్టి త్రివిక్రమ్‌ ‘నువ్వు నాకు నచ్చావ్‌’ రాశారు. దీనినే యథాతథంగా ‘నువ్వు వస్తానంటే నేను వద్దంటానా’గా తీశారు. ఇంకా పదుల కొద్దీ సినిమాలు దీని ఆధారంగా వచ్చాయి.

– కె

మరిన్ని వార్తలు