ప్యాషన్‌ మాత్రమే సరిపోదు

10 Mar, 2020 05:45 IST|Sakshi

‘‘ఏ సినిమాకైనా ప్రేక్షకులు రావాలంటే కథ, వినోదం, పాటలు బాగుండాలి. మా ‘ప్రేమ పిపాసి’లో ఇవి చక్కగా కుదిరాయి. వాటితో పాటు యువతకి కావాల్సిన బోల్డ్‌ కంటెంట్‌ కూడా ఉంది’’ అన్నారు రామకృష్ణ (ఆర్‌.కె). జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్లుగా మురళీ రామస్వామి (ఎమ్‌.ఆర్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమపిపాసి’. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. రామకృష్ణ (ఆర్‌.కె) మాట్లాడుతూ– ‘‘2000లో హైదరాబాద్‌ వచ్చాను. 2010 నుంచి కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ చేస్తున్నాను.

గతంలో ఒక  షార్ట్‌ ఫిలింలో నటించి, నిర్మించాను. మా హీరో, డైరెక్టర్‌ చెప్పిన కథ నచ్చడంతో ‘ప్రేమపిపాసి’తో సినిమా రంగంలో అడుగుపెట్టాను. హిందీలో ఇమ్రాన్‌ హష్మీ తరహాలో జీపీఎస్‌కి ఈ సినిమాతో లిప్‌ లాక్‌ హీరోగా పేరు వస్తుంది. ఈ రంగంలో రాణించాలంటే ప్యాషన్‌ ఉంటేనే సరిపోదు.. పక్కా ప్రణాళిక కూడా ఉండాలి. సినిమా చేయడం ఒక ఎత్తు అయితే విడుదల చేయడం మరో ఎత్తు అని ఈ చిత్రంతో తెలిసింది. మా బ్యానర్‌లో ఏడాదికి ఓ మంచి సినిమా చేయాలనుకుంటాను. ప్రస్తుతం ముగ్గురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు