‘ప్రేమ పిపాసి’ మూవీ రివ్యూ

13 Mar, 2020 22:05 IST|Sakshi
Rating:  

జీపీయస్‌ హీరోగా, కపిలాక్షి మల్హోత్రా జంటగా మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌పై పి.ఎస్‌ రామకృష్ణ(ఆర్‌.కె) నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ నుంచే కొత్త త‌ర‌హా ప్రేమ‌క‌థ‌గా ఆస‌క్తికి క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా?. ప్రేమ‌క‌థా చిత్రాల్లో స‌రికొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టిందా? కొత్త హీరో జీపీఎస్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? మిగతా తారాగణం ఏ స్థాయిలో మెప్పించారు? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
ఆవారాగా తిరుగుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమలో పడేస్తుంటాడు బావ (జిపీయ‌స్‌). తన అవసరం తీరగానే వారిని వదిలేస్తుంటాడు. అలా అనుకోకుండా బాలా (కపిలాక్షి మల్హోత్రా)ను చూసి తొలిప్రేమలో పడతాడు. ఆమె ఆరాధ‌న‌లో ప్రేమ పిపాసి అవుతాడు. అయితే ప్రేమ అంటూ ట్రాప్‌ చేసి అవసరం తీరగానే వదిలేసే బావ.. బాలాను ఎందుకు ప్రేమిస్తాడు? బావ గురించి పూర్తిగా తెలిసిన బాలా అతడి ప్రేమను అంగీకరిస్తుందా? అసలు ఈ కథలోకి సుమన్‌ ఎందుకు ఎంటర్‌ అవుతాడు? అమ్మాయిలను బావ ఎందుకు ట్రాప్‌ చేస్తుంటాడు? చివరికి బావ-బాలాల ప్రేమ ఎక్కడి వరకు వెళ్లింది?  అనేదే ప్రేమ పిపాసి సినిమా కథ.

నటీనటులు:
ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన జీపీఎస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. డిఫరెంట్‌ లుక్‌తో కనిపించిన జీపీఎస్‌ డ్యాన్స్‌, యాక్షన్‌ సీన్లలో తన దైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఓ నటుడిగా నిరూపించుకోవడానికి జీపీఎస్‌ కష్టపడిన విషయం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక హీరోయిన్‌ కపిలాక్షి మల్హోత్రకు ఈ సినిమాలో నటన పరంగా నిరూపించుకునేందుకు మంచి స్కోప్‌ దొరికింది. ద్వితీయార్థం సినిమా మెత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. ఇక సీనియర్‌ నటుడు సుమన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతటి ఆర్టిస్ట్ ఇలాంటి విషయం లేని పాత్రలను ఒప్పుకోవడమనే భావన అందరిలోనూ కలుగుతుంది. ఇక ఫన్‌ బకెట్‌ భార్గవ్‌, జబర్దస్త్‌ రాజమౌళి, తదితరలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ:
మెయిన్‌గా యూత్‌ను టార్గెట్‌ చేస్తూ డిఫరెంట్‌ టైటిల్‌ అండ్‌ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు మురళీ రామస్వామి. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను చెబుతూనే కొన్ని కమర్షియల్‌ హంగులను జోడించాడు. ఫస్టాఫ్‌లో బావ రొమాన్స్‌, అమ్మాయిలను ట్రాప్‌ చేయడం వంటి సీన్స్‌ యువతను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇక సుమన్‌, బాలా ఎంట్రీతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. దీంతో ప్రథమార్థం ఎక్కడా కూడా బోర్‌ కొట్టకుండా సాగిన భావన కలుగుతుంది.  

ఇక సెకండాఫ్‌లో తన కూతురును ట్రాప్‌ చేస్తున్నాడని తెలుసుకున్న సుమన్‌ తన మనుషులతో కొట్టించడం, బాలా ఇంటి ముందు బావ ధర్నాకు దిగడంతో సినిమా రసవత్తరంగా మారుతుంది. అయితే ఇదే సమయంలో ఎక్కడా కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ కాకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. జబర్దస్త్‌ ఆర్టిస్టులు చేసే కామెడీ పర్వాలేదనిపిస్తుంది. బావ అమ్మాయిలను ఎందుకు ట్రాప్‌ చేస్తున్నాడు, బాలా-బావకు గతంలో ఉన్న రిలేషన్‌ షిప్‌, ప్లాష్‌ బ్యాక్‌లతో కథను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఆర్‌ఎస్‌ అందించిన మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫర్‌ తన కెమెరా పనితనంతో హీరోహీరోయిన్లను అందంగా చూపించాడు. స్క్రీన్‌ ప్లే కూడా గజిబిజిగా కాకుండా బాగుంది. అయితే ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సివుంది. కొన్ని సీన్లలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. 

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు