2 నెలల తర్వాత ఇండియాకు పృథ్వీరాజ్‌

22 May, 2020 13:21 IST|Sakshi

కొచ్చి : ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఆదు జీవితం చిత్ర బృందం ఎట్టకేలకు కేరళ చేరుకున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జోర్డాన్‌లో చిక్కుకున్న వీరు శుక్రవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్‌ సతీమణి సుప్రియ మీనన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. దీంతో అభిమానులు, కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు  సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ప్రస్తుతం క్వారంటైన్‌కు తరలించారు.

కాగా, ఆదుజీవితం చిత్రం షూటింగ్‌ కోసం పృథ్వీరాజ్‌, దర్శకుడు బ్లెసీతోపాటు 58 మంది సభ్యులతో కూడిన చిత్రబృందం జోర్డాన్‌కి వెళ్లింది. అయితే కరోనా కట్టడిలో భాగంగా జోర్డాన్‌లో మార్చి 16న లాక్‌డౌన్‌ విధించారు. దీంతో చిత్రబృందం ఇండియాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తమను ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా చిత్ర దర్శకుడు కేరళ ప్రభుత్వానికి, ఫిల్మ్‌ చాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. తమ పరిస్థితి అంతగా బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిర్‌ ఇండియా విమానంలో వీరు ఢిల్లీ మీదుగా కొచ్చి చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత స్వదేశంలో కాలుమోపారు. 

‘దాదాపు మూడు నెలల తర్వాత పృథ్వీరాజ్‌, ఆదుజీవితం బృందం కేరళకు చేరుకుంది. నిబంధనల ప్రకారం వారిని క్వారంటైన్‌కు తరలించారు. చాలా కాలం నిరీక్షణ తర్వాత చివరకు వారు స్వస్థలాలకు చేరుకున్నారు. ఇందుకు సహకరించిన అధికారులక కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు. తన  నాన్న వచ్చాడని ఆలీ సంతోషపడుతోంది. రెండు వారాల క్వారంటైన్‌ పూర్తి అయిన తర్వాత నాన్నను కలవబోతుంది’ అని సుప్రియ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు