ఇంట్లోనే నిర్బంధించారు

15 Feb, 2019 06:48 IST|Sakshi

తనను ఇంట్లోనే నిర్బంధించారని వర్థమాన నటి ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ చెప్పింది. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత పెద్ద నటినా అని అడగకండి. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం కూడా ఇంకా తెరపైకి రాలేదు. అయినా ఒక క్రేజీ నటి అంత ప్రాచుర్యం పొందేసింది. అందుకు కారణం ఒక చిత్ర ట్రైలర్‌లో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటనే. ఈ కేరళా కుట్టి ఒరు ఆడార్‌ లవ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అవుతోంది. ఆ చిత్ర ట్రైలర్‌ గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించింది. పాఠశాలలో తన లవర్‌కు ప్రేమ సిగ్నల్‌ ఇచ్చే సన్నివేశాల్లో కన్ను కొట్టి, తన చేతి వేళ్లనే గన్‌గా మార్చి గురి చూసి అతని గుండెల్లో పేల్చే సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా పేలింది. అంతే కుర్రకారు రెచ్చిపోయి ఆ ట్రైలర్‌ను వీక్షించడం, అది దేశవ్యాప్తంగా ట్రెండీ అవడం తెలిసిందే. ఆ ట్రైలర్‌ తెచ్చి పెట్టిన క్రేజ్‌ ఒరు ఆడార్‌ లవ్‌ చిత్రానికి ఎంతగానో లాభించింది. ఇప్పుడా చిత్రం మలయాళంలో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం తెరపైకి వచ్చింది.

ఒరు ఆధార్‌ లవ్‌ చిత్రం ట్రైలర్‌ దేశ వ్యాప్తంగా ట్రెండీ అవడం నటి ప్రియ ప్రకాశ్‌వారియర్‌కు మంచి క్రేజ్‌ తెచ్చి పెట్టినా, చాలా భయపెట్టిందట. దీని గురించి ఈ బ్యూటీ ఒక ఇంటర్వూ్యలో పేర్కొంటూ ఒరు ఆడార్‌ లవ్‌ చిత్ర ట్రైలర్‌లో తాను కన్ను కొట్టే సన్నివేశం సంచలనం సృష్టించడంతో తన కుటుంబసభ్యులు చాలా భయపడ్డారని చెప్పింది. అది తన కుటుంబంతో పాటు తనకూ వినూత్న అనుభవం అని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే తనను తల్లిదండ్రులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించారని చెప్పింది. సెల్‌ఫోన్‌ కూడా తనకు దూరం చేశారని వాపోయింది. ఈ చిత్రం విడుదల కాక ముందే ఈ అమ్మడికి పలు అవకాశాలు తలుపుతట్టాయి. అయితే ఈ అమ్మడి ఒక్క చిత్రం కూడా తెరపైకి రాకుండానే పారితోషికాన్ని రూ.కోటి డిమాండ్‌ చేస్తూ దర్శక, నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తోందట. ఒరు ఆడార్‌ లవ్‌ రిజల్ట్‌ తెలియాల్సిఉంది. ఈ చిత్రం కనుక హిట్‌టాక్‌ తెచ్చుకుంటే ఇక ప్రియ ప్రకాశ్‌ వారియర్‌ను పట్టుకోవడం కష్టమే అవుతుంది. అందులోనే క్లాసికల్‌ సంగీతం, నృత్యంలో శిక్షణ పొందిన ఈ బ్యూటీకి అవి అదనపు అర్హతగా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 

మరిన్ని వార్తలు