‘సినిమా చూసి దీవించండి నిండుగా’

29 May, 2019 20:14 IST|Sakshi

హైదరాబాద్‌: నేత కార్మికుల కథ ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కించారు. నేత కార్మికుల కోసం చింతకింది మల్లేశం చేసిన సేవల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి టైటిల్‌ రోల్‌ చేశారు. రాజ్‌. ఆర్‌ దర్శకత్వంలో రాజ్‌. ఆర్, శ్రీ అధికారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్‌ 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం తాజాగా ‘మల్లేశం’  ట్రైలర్‌ను విడుదల చేసింది.

చేనేత కార్మికుడైన మల్లేశం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడానికి దారి తీసిన పరిణామాలు ఏమిటి? అవమానాల నుంచి పద్మశ్రీ వరకు ఎలా ఎదిగారు?చేనేత రంగంలో అతడు సాధించిన ఘనత ఏమిటి? అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చీర‌ల‌ను నేచి ప్రపంచాన్ని ఎలా అబ్బుర పరిచారు? అనే అంశాలతో పాటు చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఆయన చేసిన కృషి ఏమిటనే విషయాలు ఫోకస్ చేస్తూ సినిమా సాగుతుంది. అచ్చమైన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. 

ఇప్పటివరకు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈ సినిమాలో చాలా సీరియస్‌గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియదర్శిని నటుడిగా మరో మెట్టు ఎక్కించేలాగే వుంది ట్రైలర్‌. ఇక ప్రియదర్శితో పాటు అనన్య, యాంకర్‌ ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ విడుదల చేయనుంది. మార్క్‌ కె. రాబిన్‌ స్వరాలందించిన ఈ చిత్రానికి బాలు శాండిల్య సినిమాటోగ్రాఫర్‌గా చేశారు.

మరిన్ని వార్తలు