ముంబై ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి: ప్రియాంక చోప్రా

3 Jun, 2020 13:41 IST|Sakshi

ఇప్పటికే కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబై నగరాన్ని నిసర్గ తుపాన్‌ వణికిస్తోంది. గత శతాబ్ద కాలంలో ముంబై నగరాన్ని భయాందోళనకు గురిచేస్తున్న మొదటి తుపాన్‌ ఇదే కావడం విశేషం. ఇటీవల ఉంపన్‌​ తుపాన్‌ పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం పది రోజుల వ్యవధిలోనే దేశం ఎదుర్కొంటున్న రెండో తుపాన్‌ ఇది. ఇప్పటికే ముంబైలో అవసరం ఉంటే తప్ప ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ‌ ప్రకటించింది. నిసర్గ తుపాన్‌ హెచ్చరిక నేపథ్యంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ముంబై నగరంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తుపాన్‌తో జాగ్రత్త వహించేందుకు బృహన్‌ ముంబై మునిసిపాల్‌ కార్పొరేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాల జాబితాను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై పోలీసులకు‌ ఫిర్యాదు)

ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి లాస్‌ ఏంజెల్స్‌లో నివసిస్తున్నారు. అయితే  తన తల్లి మధు చోప్రా, సోదరుడు సిద్ధార్థ ముంబైలోనే ఉన్నారని వారిని జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక సూచించారు. ‘నిసర్గా తుపాన్‌ ముంబైను తాకనుంది. నా సొంత నగరమైన ముంబైలో నా తల్లి, సోదరుడితో సహా 20 మిలియన్లకు పైగా జనాభా నివసిస్తోంది. 1891 నుంచి ముంబైలో ఇంత తీవ్రమైన తుఫాను సంభవించలేదు. ఓ వైపు ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. మరోవైపు అత్యంత వినాశకరమనది కావచ్చు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. (కరోనా టెస్టుల్లో ఏపీ మరో రికార్డు)

మరో ట్వీట్‌లో ‘ఈ సంవత్సరం పూర్తిగా కనికరం లేనిదిగా కనిపిస్తోంది. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించండి. దయచేసి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అని తెలిపారు. తుపాన్‌ అలజడితో అధికారులు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంబై పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లోని వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాన్‌ ఎఫెక్ట్‌తో ముంబై నగరానికి రావాల్సిన అనేక విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అలాగే అనేక రైళ్లను మళ్లించారు. (గుజరాత్, మహారాష్ట్రలను వణికిస్తోన్న నిసర్గ)

మరిన్ని వార్తలు