తెరకెక్కుతున్న తారల జీవితాలు

7 May, 2014 22:15 IST|Sakshi
తెరకెక్కుతున్న తారల జీవితాలు

ఇద్దరు ప్రముఖ కథానాయికల జీవితాల ఆధారంగా హిందీలో రెండు సంచలన చిత్రాలు రూపొందనున్నాయి. ఒకటేమో-ఒకప్పటి అగ్రకథానాయిక సుచిత్రాసేన్ జీవిత కథ కాగా, మరొకటి - బాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా లైఫ్ స్టోరీ.సుచిత్రా సేన్ హిందీలో ఎంత పాపులరో, బెంగాలీలో అంత కన్నా పాపులర్. ‘దేవదాస్’ లాంటి ఎన్నో కళాఖండాల్లో నటించిన సుచిత్ర ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా అందుకున్నారు. సినిమాలు నటించడం మానేశాక మూడు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన ఈ మహానటి మొన్న జనవరిలో కోల్‌కతాలో కన్ను మూశారు. ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కూడిన ఆమె జీవితాన్ని తెరకెక్కించాలని అభిజిత్ చౌదురి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
 
  సుచిత్రాసేన్‌ను కలిసి చూచాయగా కథ కూడా వివరించారట. ఇప్పుడీ ఈ కథను ఆమె మనవరాలు రైమా సేన్‌తో తెరకెక్కిస్తున్నారు. రైమా సేన్ అంటే తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ చిత్రంలో కథానాయిక. నటి మూన్‌మూన్ సేన్ కూతురు. సుచిత్రాసేన్‌కి స్వయానా మనవరాలు. తెలుగులో ‘ధైర్యం’లో హీరోయిన్‌గా చేసిన అమ్మాయి. అమ్మమ్మ పాత్రను చేయడానికి రైమా తొలుత భయపడిందట. కానీ దర్శకుడు బలవంతంగా ఒప్పించారు. అందుకే రైమా తన అమ్మమ్మ నటించిన సినిమాలన్నీ చూస్తూ ఆ అభినయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హిందీ, బెంగాలీల్లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘నాయిక’ అని పేరు పెట్టారు. ఆగస్టు నుంచి షూటింగ్.
 
 ఇక ప్రియాంకా చోప్రా విషయానికొస్తే తను ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అందం కన్నా అభినయాన్నే నమ్ముకున్న ప్రియాంక జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. అవి ఆమె సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఆమెకు తొలి రోజుల ప్రియుడు అశీమ్ మర్చంట్, ప్రియాంక కథతో సినిమా నిర్మించనున్నారు. ‘67 రోజులు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పాత్రకు సాక్షి చౌదరిని ఎంపికచేశారు. ఈ సాక్షి తెలుగులో ఇటీవల ‘పోటు గాడు’ సినిమాలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రియాంక ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. చూద్దాం ఏమవుతుందో!