ముస్లింలను పరామర్శిస్తావా...?

24 May, 2018 11:04 IST|Sakshi
శరణార్ధుల శిబిరంలో చిన్నారితో ముచ్చటిస్తున్న ప్రియాంక చోప్రా

ముంబై : మంచి పని చేసినా దానికి మతం రంగు పులమడం నిజంగా విచారకరం. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు నటి ప్రియంక చోప్రా. ఈ బాలీవుడ్‌ హీరోయిన్‌ను యూనిసెఫ్‌ బంగ్లాదేశ్‌ పిల్లల హక్కుల ప్రచారకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్‌ బజార్‌లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఓ వైపు ప్రియాంక పోస్టు చేసిన ఈ ఫోటోలకు దాదాపు 6 లక్షలకు పైగా లైక్స్‌ రాగా, మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఇది సెల్ఫీ స్టంట్‌లా, పబ్లిసిటీ స్టంట్‌లా ఉందంటూ విమర్శలు గుప్పించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ముస్లిం పిల్లలకు సహయం చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక మన దేశంలో ఉన్న శరణార్ధులను ఎప్పుడైనా కలుసుకున్నారా?. కాశ్మీరీ పండిట్లు స్వయంగా మన దేశంలోనే శరాణార్ధులుగా బతుకుతున్నారు. వారిని ఎప్పుడైనా సందర్శించారా అంటూ ప్రశ్నల వర్షం కురింపించగా, మరికొందరు మాత్రం ప్రియాంక చేసిన పనిని మెచ్చుకున్నారు.

యూనిసెఫ్‌ టీ షర్టుతో చిన్నారులను పలకరిస్తున్న ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతేకాక ఈ ఫోటోలో ఒక చిన్నారి తాను ఆడుకునే బొమ్మ టీ కప్పును ప్రియాంకకు ఇవ్వగా, ప్రియాంక ఆ కప్పును తీసుకుని తాగుతున్నట్లు చేశారు. ఈ ఫోటోతో పాటు ప్రియాంక ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయిన ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి వద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. మనం వారి పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు.

మరిన్ని వార్తలు