వన్... టూ... త్రీ... రెడీ స్టార్ట్!

17 Jan, 2016 23:41 IST|Sakshi
వన్... టూ... త్రీ... రెడీ స్టార్ట్!

ప్రియాంకా చోప్రా మంచి జోరు మీద ఉన్నారు. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’తో విదేశాల్లోనూ పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు  ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో ఆమె నెగటివ్ రోల్ చేయనున్నారు. ఒకవైపు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా ఏకంగా మూడు సినిమాలు ప్రకటించేశారు. ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం...
 
‘పర్పల్ పెబెల్ పిక్చర్స్’పై ప్రియాంకా చోప్రా వరుసగా సినిమాలు తీయాలనుకుంటున్నారు. ఒక్క భాషకే ఈ సంస్థను పరిమితం చేయాలనుకోవడంలేదామె. స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో కూడా సినిమాలు తీయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి భోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషల్లో ఒక్కో చిత్రం నిర్మించనున్నారు.
 
 
‘భమ్ భమ్ బోలో రహా హై కాశీ’ పేరుతో భోజ్‌పురి చిత్రం రూపొందనుంది. భోజ్‌పురి సూపర్ స్టార్ నిరాహౌ, ఆమ్రపాలి దూబే జంటగా ఈ చిత్రం రూపొందనుంది. ఓ క్లాసిక్ లవ్‌స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ నెలలోనే చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.
 
హిందీ చిత్రం ‘ఫెరారీ కీ సవారీ’ దర్శకుడు రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో ‘వెంటిలేటర్’ పేరుతో ఓ మరాఠీ చిత్రం నిర్మించనున్నారు. ఇందులో మరాఠీ పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్ తారలతో పాటు కొత్త నటీనటులు, రంగస్థల కళాకారులు కూడా నటించనున్నారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించి, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
‘ఏక్ ఓంకార్’ పేరుతో ఓ పంజాబీ చిత్రాన్ని నిర్మించనున్నారు. పంజాబీ పరిశ్రమకు చెందిన ఓ సూపర్ స్టార్‌తో ఈ చిత్రం తీయాలనుకుంటు న్నారు. అంబర్‌దీప్ సింగ్ రాసిన కథతో ఈ చిత్రానికి కరణ్ గులియాని దర్శకత్వం వహించనున్నారు. తన మూలాలను వెతుక్కుంటూ ఇండియా వచ్చే ఓ ఎన్నారై కుర్రాడి కథతో ఈ చిత్రం సాగుతుంది. మార్చిలో చిత్రీకరణ ఆరంభించి, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 
ఇలా ఒకేసారి మూడు చిత్రాలు ప్రకటించారంటే ప్రియాంక ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారో ఊహించుకోవచ్చు. ఇంకా యాడ్ ఫిలింస్, టీవీ సీరియల్స్ కూడా తీయాలనుకుంటున్నారు ప్రియాంక.
 

>