కేటీఆర్‌ అన్నా మీకు థ్యాంక్స్‌: ప్రియదర్శి 

12 Jun, 2020 19:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. అదేవిధంగా ఆయన రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించినట్లు మంత్రి తన అధికారిక ట్విటర్‌లో పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో జరిగిన పాట విడుదల కార్యక్రమంలో ప్రియదర్శి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ పాటకు  వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా సినీ నేపథ్య గాయకులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయిచరణ్‌లు ఆలపించిన ఈ గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. 

‘ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించింది ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట మనసుని హత్తుకుంది. అలాగే వారు రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించడం జరిగింది. భారతీయ భాషలలో ఇటువంటి రచనలలో ఇది మొదటిది’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలతో పాటు పాట యూట్యూబ్‌ లింక్‌ను కూడా షేర్‌ చేశారు.   

ఇక తన తండ్రి రచించిన పాటను ఆవిష్కరించిన కేటీఆర్‌కు ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపాడు. ‘అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా నాన్నగారి పాటను నిఘంటువును ఆవిష్కరించారు. కవులను విద్యావంతులను ఇలా ఇంతగా గౌరవించే మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలము’ అంటూ ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు