నిర్మాత శివప్రసాద్‌ రెడ్డి కన్నుమూత

28 Oct, 2018 02:56 IST|Sakshi

కామాక్షి మూవీస్‌ అధినేత, ప్రముఖ నిర్మాత డి. శివ ప్రసాద్‌ రెడ్డి శనివారం (అక్టోబర్‌ 27) ఉదయం 6.30 నిమిషాలకు చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలంగా హృదయ సమస్యలతో బాధపడుతున్న శివప్రసాద్‌కి ఇటీవల అపోలో హాస్పిటల్‌లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఉత్తరమూపులో 1956లో డీవీ శేషారెడ్డి, సుదర్శనమ్మ దంపతులకు శివప్రసాద్‌రెడ్డి జన్మించారు. నెల్లూరులో హై స్కూల్‌ చదువును పూర్తి చేసిన ఆయన విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాలలో బీఏ పట్టభద్రులయ్యారు.

చదువు పూర్తయిన తర్వాత సినిమాలకు ఫైనాన్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 1985లో కామాక్షి మూవీస్‌ బ్యానర్‌ స్థాపించి శోభన్‌ బాబుతో ‘కార్తీక దీపం, శ్రావణ సంధ్య’, చిరంజీవితో ‘ముఠామేస్త్రీ’ సినిమాలు నిర్మించారు. ఆయన బ్యానర్‌లో ఎక్కువ శాతం నాగార్జునతోనే సినిమాలు చేశారు. వీళ్ల కాంబినేషన్‌లో 11 సినిమాలు వచ్చాయి. అందులో ‘అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, రగడ, గ్రీకువీరుడు’ తదితర చిత్రాలున్నాయి. 1987లో ‘విక్కీ దాదా’తో నాగార్జునకు, శివ ప్రసాద్‌కు స్నేహం మొదలైంది.

అలా వీళ్ల అనుబంధం కొనసాగుతూనే ఉంది. నాగార్జున కుమారుడు నాగచైతన్యతో ‘దడ’ చిత్రాన్ని శివప్రసాద్‌ రెడ్డి నిర్మించారు.  నిర్మాతగానే కాకుండా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ కూడా చేశారు. నిర్మాతగా ‘గ్రీకువీరుడు’ ఆయన చివరి చిత్రం.  సున్నితమైన ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగు నేటివిటీకు తన సినిమాల్లో పెద్ద పీట వేశారు. శివప్రసాద్‌ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

‘‘నా ఆప్త మిత్రుడిని కోల్పోయాను. శివప్రసాద్‌ రెడ్డి నా కుటుంబానికి చాలా దగ్గరివాడు. నా 33 ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రముఖుడు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’’ అని నాగార్జున ట్వీట్‌ చేశారు. ‘‘శివప్రసాద్‌రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి చిత్రం చేశారు. ఆయన సాత్వికుడు. నాకు మంచి మిత్రుడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి సంతాపం వ్యక్తపరిచారు.  నేడు శివప్రసాద్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు