కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నా

11 May, 2020 02:30 IST|Sakshi
‘దిల్‌’ రాజు

కొంత కాలంగా నిర్మాత ‘దిల్‌’ రాజు రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలో ఉంది. తాజాగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని (పెళ్లిని ఉద్దేశించి) ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు ‘దిల్‌’ రాజు. ఈ ప్రెస్‌ నోట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచమంతా కష్టకాలంలో ఉంది. వృత్తిపరంగా అందరూ ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగానూ కొంతకాలంగా సరిగ్గా సాగడంలేదు.

కానీ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి, అందరం బావుంటాం అనే ఆశతో ఉన్నాను. ఈ నమ్మకంతోనే నా జీవితంలో మరో ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాను’’. ఆదివారం నిజామాబాద్‌లోని ‘దిల్‌’ రాజు ఫార్మ్‌ హౌస్‌లో రాత్రి 11.30 గంటలకు అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ‘దిల్‌’ రాజు వివాహం చేసుకున్నది వాళ్ల బంధువుల అమ్మాయినే అని, సినిమా నేపథ్యం లేని కుటుంబం అని తెలిసింది. 2017లో ‘దిల్‌’ రాజు భార్య అనిత హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు