తేజు కెరీర్‌లో గుర్తుండిపోయే మరో చిత్రం... తిక్క!

10 Aug, 2016 23:04 IST|Sakshi
తేజు కెరీర్‌లో గుర్తుండిపోయే మరో చిత్రం... తిక్క!

- రోహిణ్‌రెడ్డి
 వరుస విజయాలతో దూసుకెళుతున్న సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రంగా ‘తిక్క’ నిలుస్తుందన్నారు నిర్మాత సి.రోహిణ్‌రెడ్డి. వృత్తిరీత్యా వైద్యుడైన ఆయనకు రాజకీయ రంగంలోనూ ప్రవేశముంది. తొలి ప్రయత్నంగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై ఆయన ‘తిక్క’ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ, రొమాన్ ్స, యాక్షన్, ఎమోషన్ ... ఇలా అన్ని అంశాల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందంటున్నారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘తిక్క’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత  రోహిణ్‌రెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు....
 
 కథపై నమ్మకంతోనే..: నేను నిర్మించిన మొట్ట మొదటి చిత్రమిది. దర్శకుడు సునీల్‌రెడ్డి, కథానాయకుడు సాయిధరమ్ తేజ్‌లతో ఉన్న పరిచయం వల్ల నేను పరిశ్రమకి కొత్త అనే భావన ఎప్పుడూ కలగలేదు. సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్నీ దగ్గరుండి చూసుకున్నాను. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా, పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఓ మైలురాయిలాంటి చిత్రంగా గుర్తుండిపోవాలని కష్టపడ్డాం. సాయిధరమ్ తేజ్ వరుసగా విజయాల్లో ఉన్నాడు. కథపై నమ్మకంతోనే ఆయన, నేను కలిసి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులకు కావల్సినవన్నీ సమకూరుస్తూనే, సునీల్‌రెడ్డి ఓ కొత్త కథని తెరపై చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
 
 తేజూకి కొత్తగా..: సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లూ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు. ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కుతాడు. ఎవరో ఒక కథానాయకుడితో సినిమా చేసినట్టు  కాకుండా, ఓ సొంత సోదరుడితో సినిమా చేసిన అనుభూతి కలిగింది. సునీల్‌రెడ్డి కూడా అంతే. తన అనుభవాన్నంతా ఉపయోగించి షడ్రుచుల సమ్మేళనంగా, ఓ మంచి కమర్షియల్ ప్యాకేజ్‌లాగా ఈ సినిమా చేశాడు. ఈ సినిమా చూస్తే సునీల్‌రెడ్డి ఎంత మంచి దర్శకుడో అర్థమవుతుంది.
 
  గుహన్ సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ సినిమాకి మరింత వన్నె తీసుకొచ్చాయి. ధనుష్, శింబు మా సినిమా కోసం పాట పాడడం మరో ప్రత్యేకత. వాళ్లు వాళ్ల  సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం పాడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. హీరోయిన్లు లారిస్సా బోనేసి, మన్నారాచోప్రా బాగా నటించారు. ముమైత్‌ఖాన్ తో పాటు ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉంది. కథకి ఏం కావాలో అవన్నీ పక్కాగా సమకూర్చాం. ఆ రిజల్ట్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.
 
  ఈ ప్రయాణం ఆగదు: తొలి సినిమానే మంచి అనుభవాన్ని చ్చింది. అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగాం. ఇకపై కూడా ఇలాగే సినిమాలు నిర్మిస్తా.  సాయిధరమ్ తేజ్, సునీల్ రెడ్డిలతోపాటు, ‘తిక్క’ టీమ్‌తో ఏర్పడిన బాండింగ్ దృష్ట్యా వాళ్లతోనే మరో సినిమా కూడా  చేయాలని ఉంది.