రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం

26 Dec, 2019 01:13 IST|Sakshi

‘‘సినిమా ఇండస్ట్రీపై ఉన్న ప్రేమతో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తున్నాను. పెద్ద హీరోలు నటించినా కంటెంట్‌ సరిగా లేకపోతే ఆ చిత్రాలను ప్రేక్షకులు మెచ్చరు. అలాగే కథాబలం ఉన్న మంచి సినిమాలు చిన్నవైనా, పెద్దవైనా వాటికి ప్రేక్షకాదరణ తప్పక ఉంటుంది’’ అన్నారు నిర్మాత ఏ. గురురాజ్‌. నటరాజ్, నూరిన్, అంకిత జంటగా సుఖీభవ మూవీస్‌ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సీనియర్‌ నటుడు సత్యప్రకాష్‌ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జనవరి 1న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా గురురాజ్‌ చెప్పిన విశేషాలు.

► మాది మధ్యతరగతి కుటుంబం. నటుణ్ణి కావాలని వచ్చాను. అప్పట్లో అవకాశం, అదృష్టం కలిసి రాలేదు. దాంతో సుఖీభవ ప్రాపర్టీస్‌ను స్థాపించి రియల్‌ఎస్టేట్‌ రంగంలో మంచి స్థాయికి ఎదిగాను. ఇంతకుముందు మా సుఖీభవ మూవీస్‌ సంస్థ నుంచి ‘రక్షకభటుడు, ఆనందం మళ్లీ మొదలైంది, లవర్స్‌ డే’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రం నిర్మించా. కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్‌ వంటి అంశాలు  ఈ సినిమాలో ఉన్నాయి.

► సినిమాల్లో సత్యప్రకాష్‌ విలన్‌గా కనిపించినా బయట మాత్రం మంచి వ్యక్తి. ఓ సందర్భంలో స్టోరీ లైన్‌ ఉంది వింటావా? అని సత్యప్రకాష్‌ అన్నారు. ఆయన చెప్పిన లైన్‌ నచ్చింది. ఆ లైన్‌ని తీసుకుని ‘ఊల్లాల ఊల్లాల’ స్టోరీని మేమే రాశాం. నటుడు కావాలనుకున్న వ్యక్తి నిర్మాతగా మారినప్పుడు మెయిన్‌ క్యారెక్టర్‌గా తననే పెట్టుకుని సినిమా చేస్తాడు. కానీ నేను కథలో ఏ పాత్రకు సెట్‌ అవుతానో ఆ పాత్రను మాత్రమే ఈ సినిమాలో చేశాను.

► నిర్మాతగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పట్లో మాకు ఛాంబర్‌లో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రోజుల్లో అవకాశాలు కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి. ప్రతిభ ఉన్నవారు పైకి వస్తున్నారు. మా ఆడియో ఫంక్షన్‌కు రామ్‌గోపాల్‌ వర్మగారు వచ్చారు. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తాను. రాజమౌళితో కూడా చేయవచ్చు. నాకు అందరితో సినిమాలు చేయాలని ఉంది.

► 100, 500 కోట్ల భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే స్థాయికి ఏదో ఒక రోజు నేను వెళ్తాననే నమ్మకం ఉంది. దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది నా లక్ష్యం. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే అది తప్పకుండా నేరవేరుతుంది.

మరిన్ని వార్తలు