నటనా, రెడ్‌కార్డా?

26 May, 2018 08:27 IST|Sakshi

తమిళ సినిమా: నటిస్తారా? రెడ్‌కార్డుకు సిద్ధ పడతారా? అంటూ నటుడు వడివేలుకు నిర్మాతల సంఘం అల్టిమేటం జారీ చేసిందా? దీనికి అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. విషయం ఏమిటంటే హాస్యనటుడిగా రాణిస్తున్న వడివేలును స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ హీరోగా పరిచయం చేశారు. ఆయన ఎస్‌.ప్రొడక్షన్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 2006లో తన శిష్యుడు శింబుదేవన్‌ను దర్శకుడిగా పరిచయం చేసి ఇంసై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు వడివేలుకు హీరోగా క్రేజ్‌ పెరిగింది. ఇక ఆ తరువాత హాస్య పాత్రల్లో నటించేది లేదంటూ ప్రకటించేశారు. హింసై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రం విజయంతో దర్శకుడు శంకర్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించడానికి సిద్ధమయ్యారు. దీంతో శింబుదేవన్‌ దర్శకత్వంలోనే వడివేలు హీరోగా హింసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేశారు. అందుకోసం భారీ సెట్స్‌ వేశారు. వడివేలు ఈ చిత్రంలో నటించడానికి కమిట్‌ అయ్యారు. చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయి కొంత భాగం జరిగిన తరువాత వడివేలు సడన్‌గా తానీ చిత్రంలో నటించనని వైదొలిగారు.

వడివేలు కథలో, కాస్ట్యూమ్స్‌ వంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ వివాదంపై దర్శకుడు శంకర్‌ నిర్మాతల మండలి, నడిగర్‌సంఘానికి వడివేలుపై íఫిర్యాదు చేశారు. అందులో తన చిత్రంలో వడివేలును నటింపజేయాలని, లేని పక్షంలో తాను హింసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రం కోసం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన రూ.9కోట్లను ఆయన తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరారు. దీంతో నిర్మాతల మండలి నిర్వాహకులు, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి ఈ వ్యవహారంపై చర్చించారు. నటుడు వడివేలును వివరణ కోరుతూ లేఖ రాశారు. అయితే ఆ చిత్రం కోసం తాను కేటాయించిన కాల్‌షీట్స్‌ను వారు వృథా చేశారని, దీంతో తాను పలు ఇతర చిత్రాలను కోల్పోయి నష్టపోయానని, అందువల్ల ఇకపై హింసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రంలో నటించలేనని బదులిచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌  ఇటీవల వడివేలుతో మరోసారి సమావేశమై చర్చలు జరిపారు. అప్పుడు వడివేలు తనను మరో రెండు కోట్లు అదనంగా చెల్లిస్తేనే ఆ చిత్రంలో నటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై గురువారం విశాల్‌ నేతృత్వంలో బృందం సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు వడివేలు ఎలాంటి నిబంధనలు విధించకుండా హింసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రంలో నటించాలని, లేని పక్షంలో నష్టపరిహారంగా ఆ చిత్ర నిర్మాత శంకర్‌కు రూ.9 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు, అదీ కాకపోతే నటుడు వడివేలుపై ఇకపై ఏ చిత్రంలోనూ నటించకుండా రెడ్‌ కార్టు విధించేవిధంగా తీర్మానం చేసినట్లు సమాచారం. దీంతో వడివేలు మళ్లీ హింసై అరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు