సూర్యకు నిర్మాతల అండ

27 Apr, 2020 06:49 IST|Sakshi

నటుడు, నిర్మాత సూర్య తన భార్య జ్యోతిక హీరోయిన్‌గా 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా విడుదల చేయలేని పరిస్థితి. దీంతో ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని అమేజాన్‌ సంస్థ విడుదల హక్కులను పొందింది.ఆన్‌లైన్‌లో చిత్రాన్ని విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన థియేటర్ల అసోసియేషన్‌.. సూర్య నిర్మించే చిత్రాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్ల సంఘం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న నిర్మాతల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్న అమ్మ క్రియేషన్స్‌ టి.శివ ఒక ప్రకటన విడుదల చేశారు.

అందులో ‘కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో చిన్న చిత్రాల నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే విధంగా అమేజాన్‌ సంస్థ ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం. అలాంటిది సూర్య నిర్మించిన పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయడాన్ని థియేటర్ల సంఘం వ్యతిరేకించడం సరికాదు. పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రంతో పాటు మరో ఐదు చిత్రాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారని అన్నారు.

ఇది చిన్న నిర్మాతలకు లభించిన గొప్ప అవకాశం. ఈ విషయమై ప్రముఖ డిస్టిబ్యూటర్‌ తిరుపూర్‌ సుబ్రమణ్యం కూడా చర్చిద్దామని తెలిపారన్నారు. తాజాగా విజయ్‌ నటించిన మాస్టర్, సూర్య నటించిన సూరరైపొట్రి వంటి భారీ చిత్రాలను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్టర్‌ చిత్రాన్ని రూ. 130 కోట్లకు, అదే విధంగా సూరరైపోట్రు చిత్రాన్ని రూ. 55 కోట్లకు విక్రయించే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. దీనిపై థియేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

మరిన్ని వార్తలు