అది ఫైనల్‌ కాదు

7 May, 2020 04:48 IST|Sakshi

కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు మొదలవుతాయా? అని పెట్టుబడి పెట్టే నిర్మాతల నుంచి పారితోషికం తీసుకునే నటీనటులు, సాంకేతిక నిపుణుల వరకూ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ కొన్ని నియమాలను పాటిస్తూ షూటింగ్స్‌ను జూన్‌లో ప్రారంభించుకోవచ్చని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్స్‌ మొదలైన మొదటి మూడు నెలలు పాటు యాక్టర్స్‌ తమ ఇంట్లోనే మేకప్‌ వేసుకుని సెట్స్‌కు రావాలి. ఒక అసిస్టెంట్‌ను మాత్రమే యాక్టర్స్‌ తమ వెంట తెచ్చుకోవాలి.

అలాగే 60ఏళ్లు పైబడిన వారిని క్రూ మెంబర్స్‌గా తీసుకోకూడదు. ఇటువంటి బేసిక్‌ సేఫ్టీ రూల్స్‌తో షూటింగ్స్‌ను ప్రారంభించాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. వీటిపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. ‘‘షూటింగ్స్‌ను తిరిగి ఏయే నియమాలతో ప్రారంభించాలి? ఎటువంటి షరతులు విధించాలి? అని జరిగిన చర్చలకు సంబంధించిన మా డాక్యుమెంట్‌ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫైనల్‌ కాదు. మేం ఇంకా చర్చించుకోవాలి. ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య ప్రతినిధులు, ఇండస్ట్రీ ప్రముఖులు వంటి వారితో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మాత్రమే ఫైనల్‌ గైడ్‌లెన్స్‌ నిర్ణయించి, వాటిని తెలియజేస్తాం’’ అని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది.

>
మరిన్ని వార్తలు