అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకో!?

29 Nov, 2019 16:53 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం దబాంగ్‌-3కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల దబాంగ్‌ 3 చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన సాంగ్‌ ప్రోమోలో హిందూ దేవతలు, సాధువులను కించపరిచారంటూ శుక్రవారం పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో #బాయ్‌కాట్‌దబాంగ్‌3 అనే దుమారం చెలరేగింది. కొన్నిసీన్లు అభ్యంతకరంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ జనజాగృతి అనే హిందూ ధార్మిక సంస్థ దబాంగ్‌3 చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలని పిలుపునిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. 'మై హు దబాంగ్‌ దబాంగ్‌' అనే సాంగ్‌లో హీరో సల్మాన్‌ వెనుకగా కొంతమంది సాధువులు గిటార్‌ పట్టుకుని తమ కాళ్లను కదిపే సీన్లు ఉన్నాయి. దీంతో సల్మాన్‌ హిందువుల వ్యతిరేకి అని, డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న దబాంగ్‌3ను అడ్డుకోవాలని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎవరు ఎన్ని ఎత్తులేసినా.. దబాంగ్‌3 మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతుందని సల్మాన్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక హీరో అక్షయ్‌కుమార్‌ ఇదివరకు 'భూల్‌ భులయ్యా' సాంగ్‌లో సాధువులను వెంటేసుకుని డాన్స్‌ చేస్తే రాని నిరసనల హోరు.. ఇప్పుడెందుకొస్తుందని వెనకేసుకొస్తున్నారు. కేవలం ముస్లిం కావడంతోనే ఇలా రచ్చ రచ్చ చేస్తున్నారని సల్మాన్‌ అభిమానులు  ప్రశ్నిస్తున్నారు. సల్మాన్‌ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాడని, అంతా ద్వేషం పనికిరాదని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం సినిమాను బాయ్‌కాట్‌ చేయకుండా కేవలం 10 సెకన్ల నిడివిగల సాధువులు ఉన్న సీన్‌ కట్‌చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు