నాకు ఆ పదవి అక్కర్లేదు.. రాజీనామా చేస్తా : పృథ్వీ

20 Oct, 2019 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశం మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు.  ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్.. ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు నరేష్ తప్ప మిగిలిన సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ వర్గం.. జీవితా రాజశేఖర్ వర్గం మధ్య మాటల యుద్ధం జరిగింది. అధ్యక్షుడు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేష్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. అయితే  ఇది జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ సమావేశం మాత్రమేనని జీవితా రాజశేఖర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ‘మా’ లో ఈసీ మెంబర్‌గా ఉన్న ఎస్వీబీసీ చానెల్‌ చైర్మన్‌ పృథ్వీ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌పై నిప్పులు చెరిగారు. తనకు ఈసీ మెంబర్‌ పదవి అక్కర్లేదని, ‘మా’  తీరు మారకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈసీ మెంబర్‌గా గెలిచినందుకు ఆనందపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. ‘  మా’ లో ఎవరి గ్రూపులు వారు పెట్టుకున్నారని, మెంబర్స్‌ కూడా ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరని గోపాలకృష్ణని ఘోరంగా అవమానించారని విమర్శించారు. సభ్యుల తీరు నచ్చకనే సమావేశం నుంచి బయటకు వచ్చాననిమ గోపాలకృష్ణ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు