పూజై ఫస్ట్‌లుక్‌కు విశేష ఆదరణ

19 Apr, 2014 00:39 IST|Sakshi
పూజై ఫస్ట్‌లుక్‌కు విశేష ఆదరణ

పూజై చిత్ర ఫస్ట్‌లుక్ ఫొటోలకు విశేష ఆదరణ లభించింది. విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న మూడవ చిత్రం ఇది. దీనికి కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ దేశంలోని ముఖ్యమైన సమస్యపై హీరో చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశమన్నారు. దాన్ని కుటుంబ నేపథ్యంలో చక్కని ప్రేమ సన్నివేశాలను జోడించి చిత్రీకరిస్తున్నామని చెప్పారు.
 
ముక్కోణపు ప్రేమ కథలా ఇది ముక్కోణపు యాక్షన్ కథా చిత్రమని తెలిపారు. గత చిత్రాల మాది రిగానే ఈ పూజైలోను జనరంజక అంశాలు ఉంటాయని వివరించారు. ఇంతకుముందు విశాల్ హీరోగా చేసిన తామరభరణి చిత్రం పూర్తిగా యాక్షన్ ఓరియంటెండ్ కథా చిత్రం కాదన్నారు. పూజై మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కథా చిత్రమన్నారు.
 
ఈ చిత్ర కథ కోయంబత్తూరు నేపథ్యంలో సాగుతుందన్నారు. పూజై చిత్రానికి అందమైన హీరోయిన్ అవసరం అయ్యారని చెప్పారు. అలాంటి మోడ్రన్ లుక్, ఫ్రెష్‌నెస్ టచ్‌కు శ్రుతిహాసన్ కరెక్టుగా ఉంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశామని చెప్పారు. చిత్రంలో శ్రుతిహాసన్ పాత్ర ఆరంభం నుంచి చివరి వరకు ఉంటుందని దర్శకుడు హరి పేర్కొన్నారు.