దర్శకుడు రాజ్‌కుమార్‌ కన్నుమూత

16 Feb, 2020 03:34 IST|Sakshi
రాజ్‌కుమార్‌

చిరంజీవి తొలి సినిమా ‘పునాది రాళ్లు’ తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్‌ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో గల తన నివాసంలో మృతి చెందారు. ‘పునాదిరాళ్లు’ చిత్రం చిరంజీవికే కాదు రాజ్‌కుమార్‌కి కూడా తొలి సినిమాయే. రాజ్‌కుమార్‌ మొదటి సినిమానే ఐదు నంది అవార్డులు సాధించడం విశేషం. ఆ తర్వాత ‘ఈ సామ్రాజ్యం మాకొద్దు, మన వూరి గాంధీ, ఇంకా తెలవారదేమి, తాండవకృష్ణ తరంగం, మా సిరి మల్లి’ వంటి సినిమాలను తెరకెక్కించారాయన. రాజ్‌కుమార్‌ స్వస్థలం విజయవాడ దగ్గర ఉయ్యూరు. గూడపాటి రాజ్‌కుమార్‌ ఆయన పూర్తి పేరు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాతే ఆయన భార్య కూడా చనిపోవడంతో రాజ్‌కుమార్‌ కుంగిపోయి అనారోగ్యం పాలయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని ఉయ్యూరు తీసుకెళ్లారు ఆయన చిన్న కుమారుడు.

రాజ్‌కుమార్‌ మరణం తీరని లోటు. ఆయన ‘పునాది రాళ్లు’ తీయాలనుకున్నప్పుడు నన్నో వేషం వేయమని అడిగారు. అప్పటికి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నా శిక్షణ పూర్తి కాలేదు. ఆ విషయం చెప్పినా కూడా నువ్వే చేయాలి అన్నారు. నా నట జీవితానికి ‘పునాది రాళ్లు’ సినిమా పునాది వేసింది. ఈ మధ్యనే ఆయన్ని కలిశాను. అనారోగ్యంతో ఉన్నారని చెబితే అపోలో ఆసుపత్రిలో వైద్యపరీక్షలు కూడా చేయించాం. కోలుకుని నా దగ్గరకు వస్తారనుకుంటే ఇలా జరగడం విచారకరం. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.  
– నటుడు చిరంజీవి

మరిన్ని వార్తలు