ప్రపంచంలో ఎన్నో కష్టాలున్నాయి

30 Mar, 2020 00:07 IST|Sakshi
పూరి జగన్నాథ్‌

‘‘ఈ లాక్‌డౌన్‌ పిరీడ్‌ చాలా కష్టంగా ఉంది. స్వతంత్రం పోయింది. బయటికెళదామంటే పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. తెచ్చిన సరుకులు ఎన్ని రోజులు వస్తాయో తెలీదు.. చాలా కష్టాలు పడుతున్నాం. మనలాంటి కష్టాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి.. కొన్ని చెబుతా’’ అంటున్నారు పూరి జగన్నాథ్‌. ఆయన చెప్పిన విషయాలు ఈ విధంగా...

► 2011లో ప్రారంభమైన సిరియా యుద్ధం 2019 వరకూ సాగింది. సిరియా మొత్తం నాశనం అయింది.. లక్షల మంది చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ శిథిలాల మధ్య పెళ్లాం పిల్లలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

► నైజీరియాలో ఓ టెర్రరిస్ట్‌ గ్రూప్‌ 2009లో ఓ యుద్ధం ప్రారంభించింది.. అక్కడ కూడా లక్షల మంది చచ్చిపోయారు. 2014లో ఒక స్కూల్‌ నుంచి 300 మంది అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నాప్‌ అది. చాలా మందిని మానభంగం చేశారు. తప్పించుకోవాలని చూసినవాళ్లని చంపేశారు. మిగిలిన వాళ్లు 2019లో వారి ఇంటికి చేరారు. ఇన్నేళ్లు ఆ అమ్మాయిలు కానీ వారి ఇంట్లో వాళ్లు కానీ ఎంత ఏడ్చి ఉంటారు.

► బంగ్లాదేశ్‌ నుంచి ఇండియాకి బతకాలనే స్ఫూర్తితో వచ్చేవారు కొందరైతే, చెడు చేయాలనుకునేవారు మరికొందరు. వాళ్లు బోర్డర్‌లో రక్షణ కంచె దాటుతుంటారు. మన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వాళ్లని కాల్చేస్తుంటారు. మహిళలు, పిల్లల మృతదేహాలు ఉంటాయక్కడ.

► అనాథపిల్లలదీ అదే పరిస్థితి. పిల్లల్ని కని తుప్పల్లోనో, చెత్తకుప్పల్లోనే పడేస్తుంటారు. అటువంటి వారి సంఖ్య ప్రతి రోజూ దాదాపు ఐదు నుంచి ఆరువేలు ఉంటుంది. వారిలో ఎంత మంది బతికారో, ఎంతమంది పాలు లేక చచ్చిపోయారో, ఎందర్ని దత్తత తీసుకున్నారో ఆ దేవుడికే తెలుసు. భారతదేశ ప్రభుత్వం గత లెక్కల ప్రకారం చూస్తే నాలుగు కోట్ల మంది అనాథలు ఇండియాలో ఉన్నారు. వాళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.

► సియాచిన్‌ అనే మంచు కొండపైన మైనస్‌ 50–60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ మన సైనికులు కాపలా కాస్తూ ఇండియాని రక్షిస్తుంటారు. అక్కడ ఎక్కడానికే వాళ్లకి చాలా రోజులు పడుతుంది. తినడానికి మూడు పూటలా తిండి కూడా ఉండదు. మాట్లాడేందుకు ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా సరిగ్గా ఉండవు. హెలీకాఫ్టర్‌లో తీసుకెళ్లి ఆహారం కిందికి జారవిడుస్తుంటారు. అది వాళ్లకి అందిందో లోయలో పడిందో తెలియని పరిస్థితి. అయినా ఎన్నో ఏళ్లుగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నారు.

► అలా ప్రపంచంలో ఇన్ని కష్టాలు, ఎన్నో దరిద్రాలు ఉంటే.. వాటితో పోలిస్తే మన లాక్‌డౌన్‌ అన్నది నథింగ్‌.. ఏప్రిల్‌ 14కి లాక్‌డౌన్‌ అయిపోతుందనుకోవద్దు.. మే 1కి వెళ్లొచ్చు, జూన్‌ 1కి వెళ్లొచ్చు. అందుకు సిద్ధపడి ఉండండి. దయచేసి అందరూ లాక్‌డౌన్‌కి సహకరిద్దాం.

మరిన్ని వార్తలు