పెప్పర్‌ స్ప్రే సరిపోదు.. అంతకు మించి!

4 Feb, 2018 01:43 IST|Sakshi
మంజిమా మోహన్‌

ఆ మధ్య అనుష్క ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌లో పాల్గొంటే ఎవరో ఆకతాయి తాకాడు. అంతకుముందు శ్రియ తిరుమల వెళ్లినప్పుడు ఇలాంటి సంఘటనే. మొన్న సనూష ట్రైన్లో వెళ్లినప్పుడు ఓ చేదు అనుభవం. మిల్క్‌ బ్యూటీ తమన్నా ఓ వేడుకలో పాల్గొంటే ఓ ఆకతాయి చెప్పు విసిరాడు. కథానాయికలకు ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామందిలో ఈ ప్రశ్న ఉంది. కథానాయికలనే కాదు.. మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. దీని గురించి కథానాయిక మంజిమా మోహన్‌ మొహమాటం లేకుండా మాట్లాడారు.

‘‘అసలు ట్రైన్లో ఒక మహిళతో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవరిస్తుంటే మిగతా ప్యాసింజర్లందరూ ఎందుకు కామ్‌గా ఉన్నారో, ఆ సమయంలో వాళ్లు ఏం ఆలోచించారో అర్థం కావడం లేదు’’ అని సనూషకు ఎదురైన అనుభవం గురించి అన్నారు. ఇంకా మంజిమా మోహన్‌ మాట్లాడుతూ – ‘‘ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు సెఫ్టీ కోసం పెప్పర్‌ స్ప్రేను బ్యాగ్‌లో క్యారీ చేయమని నా బ్రదర్‌ సలహా ఇచ్చేవాడు. ‘నీకేమైనా పిచ్చా. పాతకాలపు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో మహిళలకు ఎంతో సెఫ్టీ ఉంది’ అని నేను తనతో అనేదాన్ని.

కానీ ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నా మాటలు నిజం కాదని అర్థమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న అరాచకాల నుంచి బయటపడటానికి పెప్పర్‌ స్ప్రే మాత్రమే కాదు.. అంతకుమించిన వస్తువులను ఏవో మహిళలు తమ వెంట ఉంచుకోవాలేమో అనిపిస్తోంది. ఈ పరిస్థితులో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలను ఒక సెక్సువల్‌ ఆబ్జెక్ట్‌గా చూడడం మానుకోవాలి. వారి అభిప్రాయాలకు, ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాలి’’ అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌ ‘క్వీన్‌’ మూవీ మలయాళ రీమేక్‌ ‘జామ్‌ జామ్‌’లో నటిస్తున్న మంజిమ.. మూడేళ్ల క్రితం నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

మరిన్ని వార్తలు