ఈ చిత్రం ఓ దేశభక్తి గీతం : గద్దర్

23 Feb, 2016 22:50 IST|Sakshi
ఈ చిత్రం ఓ దేశభక్తి గీతం : గద్దర్

 ‘‘తరతరాలుగా  ప్రకృతికి, మానవునికి  నుంచి ఎంతో అనుబంధం ఉంది. మన దేశ అభివృద్ధికి మూల కారణమైన సహజ వనరులు ఉన్న దండకారణ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈ చిత్రం ఓ దేశభక్తి గీతం’’ అని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘దండ కారణ్యం’. ఈ చిత్రానికి ఆర్.నారాయణమూర్తే పాటలు స్వరపరిచారు. ఆ పాటలను గద్దర్ ఆవిష్కరించారు.
 
  ఈ సందర్భంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ- ‘‘దండకారణ్యం ఇప్పుడు నిత్యం పోరాటాలతో మునిగితేలుతోంది. అలాంటి ‘దండకారణ్యం’ మీద సినిమా తీయడం సాహసమే’’ అని అన్నారు. ‘‘అనేక మంది త్యాగధనుల పోరాటంతో మనకు స్వాతంత్య్రం లభించింది. కానీ ఇప్పుడు మళ్లీ విదేశీ కంపెనీలను మన దేశంలోకి ఆహ్వానిస్తున్నాం. ఇదంతా ఎందుకోసం, ఎవరి కోసం? మన సంపద ఎవరి చేతుల్లోకి పోతోంది? అనే ప్రశ్నలకు సమాధానం చెబుతుందీ చిత్రం’’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఈ వేడుకలో ప్రజాకవి గోరటి వెంకన్న, ప్రజాప్రతినిధి నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.