ఓటు ఊపిరి లాంటిది

26 Apr, 2019 01:18 IST|Sakshi
ఆర్‌. నారాయణమూర్తి

‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మన దేశంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. కానీ, ప్రస్తుతం నోటుకు ఓటుని అమ్ముకుంటున్నారు. పవిత్రమైన ఓటు విలువను తెలియజేసే చిత్రం నా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే కథనంతో ఈ సినిమా నిర్మించాం’’ అని ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. స్నేహచిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆయన లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాని మేలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌.నారాయణమూర్తి ఈ విధంగా మాట్లాడారు.

► ప్రజాస్వామ దేశంలో ఓటు ఊపిరి లాంటిది. ఓటు అనేది అందరి సమాన హక్కుగా అంబేద్కర్‌గారు రాజ్యాంగంలో రాశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో  ఓటు హక్కును అమ్ముకుంటున్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఏమైపోతోంది ఈ ప్రజాస్వామ్యం? అని ఏడుపొస్తోంది. ఇండియాలో ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కళాకారులపై, జర్నలిస్టులపై ఉంది. మనం ప్రజల పక్షాన నిలిచినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడలో ఉండగలుగుతుంది.

► పార్టీ తల్లిలాంటిది. కానీ, ఓ పార్టీ గుర్తుపై గెలిచిన వారు స్వలాభం కోసం మరో పార్టీలో చేరుతున్నారంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం భారతదేశం అక్రమ పొత్తులపై కొనసాగుతోంది. పదవుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అధికార పక్షం ఒక్కటే కాదు.. బలమైన ప్రతిపక్షమూ ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నారు.

► నాయకులు అనేవారు ప్రజలకు మార్గదర్శకుల్లా ఉండాలి.. ఓటుకు డబ్బులిచ్చేవారు నాయకులు కారు.. వ్యాపారవేత్తలు.. వారు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినవారు గెలిచాక ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టరు.. ఖర్చు పెట్టిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలి? అని ఆలోచిస్తుంటారు. విజయనగరం, బొబ్బిలి, ఆలూరు, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రదేశాల్లో మా సినిమా షూటింగ్‌ జరిపాం. చిత్రీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే పాటలు రిలీజ్‌ చేసి, మేలో సినిమా విడుదల చేస్తాం. ఎల్‌.బి. శ్రీరామ్, కాశీ విశ్వనాథ్, గౌతంరాజు, కృష్ణనాయక్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్, నిర్మాణ నిర్వహణ: రామకృష్ణారావు, కథ, కథనం, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్‌. నారాయణమూర్తి.

మరిన్ని వార్తలు