దాసరి శిష్యుడి ఉద్వేగభరిత ప్రసం‍గం

10 Jun, 2017 18:01 IST|Sakshi
దాసరి శిష్యుడి ఉద్వేగభరిత ప్రసం‍గం

హైదరాబాద్‌: తెలుగు చిత్రపరిశ్రమ దిక్సూచి, ఆత్మబంధువు దాసరి నారాయణరావు అని నటుడు ఆర్‌.నారాయణ మూర్తి అన్నారు. తన గురువు గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన దాసరి సంతాప సభలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. దాసరికి దాదా సాహెబ్‌ ఫాల్క్‌ అవార్డు వచ్చేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు చిత్రపరిశ్రమ పయత్నించాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ పురస్కారాల్లో దక్షిణాది నటులకు ముందునుంచి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విద్యాబాలన్‌కు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సావిత్రి, ఎస్వీ రంగారావులకు పద్మశ్రీ లేద’ని వాపోయారు.

తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు దాసరి అని, తన గురించి ఏమీ అడగకుండా వేషం ఇచ్చారని వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ రాణించారని పేర్కొన్నారు. దాసరి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డబ్బున్నవారి వారసులు నటులు కావాలనుకోవడంలో తప్పులేదని, సామాన్యులకు కూడా వేషాలు ఇస్తూ ప్రోత్సహించాలని దర్శక నిర్మాతలను నారాయణమూర్తి కోరారు. దాసరికి దాదాసాహెబ్‌ ఫాల్క్‌ అవార్డు ఇవ్వాలని ఈ సభలో తీర్మానం చేయబోతున్నామని రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.