నాకు నేనే పోటీ

13 Dec, 2017 00:33 IST|Sakshi

‘‘ఒకప్పుడు అన్నదాతను అందరూ సుఖీభవ అని దీవించేవారు. కానీ, నేడు అన్నదాతల బతుకు దుఃఖీభవగా మారింది. అలాంటి రైతు సమస్యలను ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్‌. నారాయణమూర్తి. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ షూటింగ్‌ పూర్తయింది. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘రైతు సమస్యలపై తీసిన చిత్రమిది. దేశానికి తిండి పెడుతున్న రైతు సంక్షేమాన్ని పట్టించుకునేవాడే లేడు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

రైతులపై పార్లమెంటులో చర్చ జరగాలి. పంటలకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వమే కల్పించాలనే స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. రుణాలు మాఫీ చేయకపోవడంతో అప్పుల బాధ తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నదాతల సమస్యలకు పరిష్కారం మా సినిమాలో చూపిస్తున్నాం. ఖమ్మం, వరంగల్, ఉభయగోదావరి, ఢిల్లీలో చిత్రీకరించాం. ఫిబ్రవరిలో రిలీజ్‌ అనుకుంటున్నాం. నాకెవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ’’ అన్నారు. 

మరిన్ని వార్తలు