రాజా ది గ్రేట్‌

3 Feb, 2019 14:25 IST|Sakshi

సంగీత సామ్రాజ్యానికి ఏకైక రారాజు ఇళయరాజా

సత్కారం గర్వం కాదు

రుణం తీర్చుకుంటున్నాం : విశాల్‌

తమిళ సినిమా: సంగీత సామ్రాజ్యానికి  ఏకై క రారాజు ఇళయరాజానే అని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ ప్రశంసించారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సంగీతజ్ఞాని ఇళయరాజా, పలు భాషల్లో వెయ్యి చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి ప్రపంచ ఖ్యాతి గాంచారు. ఈ సందర్భంగా ఆయనను నిర్మాతల మండలి ఘనంగా సత్కరించే రీతిలో స్థానిక నందనంలోని వైఎంసీఏ మైదానంలో రెండు రోజులు పాటు బ్రహ్మాండంగా సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌  చేతుల మీదుగా సంగీత విభావరిని ప్రారంభించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భారతీయ సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లక్షలాదిమంది సంగీత ప్రియులు విచ్చేశారు.

కళాకారులు, గాయనీగాయకులు పలువురు పాల్గొని ఆటపాటలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ మాట్లాడుతూ 1996లో తన అన్నయ్య వరదరాజన్‌తో కలసి చెన్నై నగరానికి వచ్చిన ఇళయరాజా, అన్నక్కిళి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారన్నారు. గ్రామీణ పాటలకు, తమిళ సంప్రదాయ పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసి ఘనుడు ఇళయరాజా అని పేర్కొన్నారు. కేవలం 13 రోజుల్లో సింపోనిని సమకూర్చి ప్రపంచ రికార్డు సాధించిన ఖ్యాతి ఆయనదని కీర్తీంచారు. 5 జాతీయ అవార్డులకు అలంకారంగా మారిన ఘనత ఇళయరాజాదని శ్లాఘించారు. ఈయనకు తమిళం, తెలుగు అంటూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి సంగీతజ్ఞాని సంగీత పయనం ఇంకా పలు కాలాల పాటు దిగ్విజయంగా కొనసాగాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

సంగీత సామ్రాజ్యానికి రారాజు
నిర్మాతల మండలి అధ్యక్షడు, నటుడు విశాల్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రాజు ఉంటారని, అయితే సంగీత సామ్రాజ్యానికి మాత్రం ఏకైక రారాజు ఇళయరాజానే అని అన్నారు. అలాంటి సంగీత రాజును సత్కరించుకోవడం తమకు గర్వం కాదని, ఆయన రుణాన్ని కొంచెం అయినా తీర్చుకోవడం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆపాలని చాలామంది ప్రయత్నించారన్నారు. అయితే ఇళయరాజా చాలాకాలం క్రితమే ఒక చిత్రం కోసం ఎన్‌ కిట్ట మోదాదే నా రాజాధిరాజనడా (నాతో ఢీకొనవద్దు నేను రాజాధిరాజునురా) అన్న పాటను రూపొందించారన్నారు. ఆ విషయం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న వారికి అర్థం అయ్యి ఉంటుందని విశాల్‌ చురకలు వేశారు. 

ఇళయరాజానే నాకు స్ఫూర్తి : ఏఆర్‌ రెహ్మాన్‌
ప్రఖ్యాత సంగీత దర్శక ద్వయం ఇళయరాజాను, ఏఆర్‌ రెహ్మాన్‌ను ఒకే వేదికపై చూడడం ప్రేక్షకులకు కనులపండుగగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్‌ రెహ్మాన్‌ మాట్లాడుతూ.. తనకు ఇళయరాజానే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు హెడ్‌మాస్టర్‌ ముందు నిలబడిన స్టూడెంట్‌గా అనిపిస్తోందన్నారు. తనకు ఆస్కార్‌ అవార్డు లభించినప్పుడు ఎందరో సంగీత దర్శకులు అభినందించినా, సంగీత మేధావి ఇళయరాజా ప్రశంసలను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. అనంతరం ఇళయరాజా మాట్లాడుతూ.. ఏఆర్‌ రెహ్మాన్‌ తన తండ్రి వద్ద కంటే తన వద్దే ఎక్కువ రోజులు ఉన్నారని, తనతో 500ల చిత్రాలు పనిచేశారని గుర్తుచేసుకున్నారు. కాగా, ఈ వేదికపై సినీ పరిశ్రమ అంతా కలసి ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్‌ను బహుకరించారు. కాగా ఈ బ్రహ్మాండ సంగీత విభావరి కార్యక్రమానికి నటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆసాంతం రక్తికట్టించారు.  

మరిన్ని వార్తలు