నాన్న చెప్పినవి ఫాలో అవుతున్నా

21 Jun, 2020 00:20 IST|Sakshi
తండ్రి రాజ్‌ ఖన్నాతో రాశీ

– రాశీ ఖన్నా

ఫాదర్స్‌ డే స్పెషల్‌

‘‘ఏ అమ్మాయికైనా తండ్రిలో ఫ్రెండ్‌ కనబడితే ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్‌. మా నాన్న అలాంటివారే’’ అంటున్నారు రాశీ ఖన్నా. తన తండ్రి ‘రాజ్‌ ఖన్నా’ గురించి ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చారు.

► నా జీవితం మీద మా నాన్నగారి ప్రభావం చాలా ఉంది. ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం... అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు. ఇవాళ నేను నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నానంటే ఆయనే కారణం.

► నా చిన్నప్పుడు నాన్న చాలా స్ట్రిక్ట్‌. అందుకని భయంగా ఉండేది. కానీ నేను పెరిగేకొద్దీ నాన్న ఫ్రెండ్లీ అయ్యారు. ఇప్పుడు నేను దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు ఉంది. మనం అమ్మానాన్నలతో చెప్పుకోలేనివి ఫ్రెండ్స్‌తో చెప్పుకోవచ్చంటారు. నాకు అలాంటి మంచి ఫ్రెండ్‌ మా నాన్న. కొన్ని నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను ఆయన సలహా అడుగుతాను.

► యాక్చువల్లీ మా నాన్న మంచి ఫ్యామిలీమేన్‌. తన భార్యను బాగా చూసుకుంటారు. కూతురంటే చాలా ప్రేమ. మొత్తం ఫ్యామిలీకి ఓ పిల్లర్‌ ఆయన. ఇలాంటి తండ్రికి కూతురిని కావడం ఆ దేవుడి ఆశీర్వాదమే అనుకుంటున్నాను.

► ఫాదర్స్‌ డే అంటే మా డిన్నర్‌ బయటే. తీరికగా కబుర్లు చెప్పుకుంటూ, నచ్చిన ఫుడ్‌ తింటూ బాగా ఎంజాయ్‌ చేస్తాం. లాక్‌డౌన్‌ వల్ల బయటి ఫుడ్‌ నో. అందుకే మా నాన్న కోసం నేను స్పెషల్‌గా కేక్‌ తయారు చేస్తున్నాను.

► మనం ఎవరినైనా సంతోషపెట్టాలంటే పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనవసరంలేదు. వాళ్ల కోసం మనం చేసే చిన్న చిన్న పనులు కూడా వాళ్లను సంతోషపరుస్తాయని నాన్న అంటుంటారు. ఆయన చెప్పినవి ఫాలో అవుతున్నాను. నాన్నకు నేను కేక్‌ చేయడం అనేది చాలా చిన్న విషయం. కానీ కూతురు చేసిన కేక్‌ కాబట్టి నాన్న చాలా ఆనందపడతారు. మా నాన్న ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఈ ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా కోరుకుంటున్నాను.

మరిన్ని వార్తలు