దేశం కోసం రాజీ

12 May, 2018 01:34 IST|Sakshi

మల్టీప్లెక్స్‌ మూవీ

‘‘భారతదేశం ఆకాశం కేసి చూస్తూ ఉంటుంది... పాకిస్తాన్‌ భారత్‌ కాళ్ల కింద నేలను కబళిస్తుంది’’ అంటూ గెలుపు నవ్వు నవ్వుతాడు తనింట్లో భోజనాల బల్ల మీద భోజనం చేస్తూ పాకిస్తానీ బ్రిగేడియర్‌ సయ్యద్‌ (శిశిర్‌ శర్మ). ఆ మాటకు ఇద్దరు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులూ ఆనంద పడ్తారు. ఆ ఇద్దరిలో ఒకరు బ్రిగేడియర్‌ చిన్న కొడుకు ఇక్బాల్‌ (విక్కీ కౌశల్‌), అతని భార్య సెహమత్‌ (అలియా భట్‌). ఇక్బాల్‌ కూడా పాకిస్తానీ ఆర్మీ ఆఫీసరే.

మరి అతని మనసెందుకు చివుక్కుమంటుంది తండ్రి మాటకు? అతని భార్య సెహమత్‌ భారతీయురాలు కాబట్టి! భోజనాలయిపోయి.. ఆ రాత్రి తమ గదిలోకి వెళ్లాక భార్యతో చెప్తాడు.. ‘‘సారీ.. మావాళ్లు కొంచెం ఇన్‌సెన్సిటివ్‌æ.. ఇండియా గురించి అలా మాట్లాడుతుంటే నీకెంత బాధనిపించుంటుందో అర్థం చేసుకోగలను. సారీ... ’’ అంటూ! పెద్దవాళ్ల ఇష్టంతో మాత్రమే జరిగిన తమ పెళ్లిలో.. భార్య ఎలాంటి ఇబ్బంది పడకూడదని.. తమ మనసులు కలిసేవరకు..  చెలిమి పెరిగే వరకూ తను భార్య దగ్గర తొందరపడకూడదని.. ఆమె తన ఇష్టం చెప్పేంత వరకు దగ్గరకు రాకూడదని భార్య స్పేస్‌ను గౌరవిస్తుంటాడు. సెహమత్‌కు హిందుస్థానీ క్లాసికల్‌ ఇష్టం అని ఆ రికార్డ్స్‌ను ప్రెజెంట్‌ చేసి తనూ ఆ సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెడ్తాడు.

అలా భార్య భారతదేశంలో ఎలా పెరిగిందో.. ఎలాంటి అలవాట్లతో వచ్చిందో అలాగే పూర్తిగా ఆమెను అంగీకరించేలా తనను సన్నద్ధం చేసుకుంటుంటాడు. వాటిల్లో ఆమె దేశభక్తి కూడా ఒకటని తెలుసుకుంటాడా? అంగీకరిస్తాడా? ఆమె పట్ల అతనికున్న ప్రేమ దాన్నీ జయిస్తుందా? రాజీ పడేలా చేస్తుందా? ‘‘మనిద్దరి మధ్య ఏదీ నిజం కాదా సెహమత్‌?’’ తన పట్ల తుపాకీ గురిపెట్టిన భార్యను అడుగుతాడు ఇక్బాల్‌ ఆవేదనగా.. భార్య చేతిలో తుపాకి అబద్ధమైతే బాగుండు అనే ఆశతో.. తను అపురూపంగా తొడిగిన మువ్వల పట్టీల సవ్వడి రేపిన అలజడి అసత్యమైతే బాగుండు అనే ఆరాటంతో! ‘‘దేశం ఒక్కటే నిజం’’ అంటూ స్థిరంగా పలికిన భార్య స్వరం.. ఆయన భ్రమను పటాపంచలు చేస్తుంది. అందుకే అంటాడు ‘‘రెండు బుల్లెట్లు మాత్రమే వాడు.. ఒకటి నీ కోసం.. ఇంకోటి నా కోసం.. ఎందుకంటే దేశం ఒక్కటే నిజం కాబట్టి’’ అని.


ఏంటీ యుద్ధం?
‘‘బంధాలు..అనుబంధాలు, ప్రాణాలకు విలువివ్వని ఈ యుద్ధం ఎందుకు? నా భర్తను చంపుకొని, నన్ను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేసి నేను సాధించిందేంటి?’’ అదే ఆవేదన సెహమత్‌లో కూడా! తండ్రి అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తుంది. కానీ ఎంతమందిని పణంగా పెట్టింది? ముఖ్యంగా తనను ప్రాణంలా ప్రేమించిన భర్తను! మిషన్‌ పూర్తి చేసుకొని కడుపులో నలుసుతో మాతృదేశం తిరిగొస్తుంది. ఏ యుద్ధాన్ని ద్వేషిస్తుందో.. ఏ గూఢచారి వ్యవస్థను అసహ్యించుకుంటుందో మళ్లీ అదే యుద్ధంలో.. అదే వ్యూహంలోకి తన కొడుకును సైనికుడిగా పంపిస్తుంది.ఇదీ సెహమత్‌ ఖాన్‌ జీవితం... రాజీ సినిమా కథ!ఒక సైనికుడి తల్లి నిజ జీవిత కథ ఆధారంగా ఇండియన్‌ నేవీ మాజీ లెఫ్టినెంట్‌ కమాండర్‌ హరీందర్‌ ఎస్‌ సిక్కా రాసిన ‘‘కాలింగ్‌ సెహమత్‌’’ నవలే రాజీ సినిమా! మేఘనా గుల్జార్‌ దర్శకురాలు.

కథా వివరం..
కాలం 1971. హిదాయత్‌ ఖాన్‌ (రజిత్‌ కపూర్‌), పాకిస్తానీ బ్రిగేడియర్‌ సయ్యద్‌కు భారతదేశ సైనిక రహస్యాలను అందచేస్తున్నట్టు నటిస్తూనే పాకిస్తాన్‌ వ్యూహాన్ని గ్రహిస్తుంటాడు. అలాంటి ఒక సందర్భంలోనే భారత నావికా దళం మీద తన ఆధిపత్యం కోసం పాకిస్తాన్‌ కుట్రకు సిద్ధమైందనే విషయాన్నీ తెలుసుకుంటాడు. అప్పటికే అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందని తేలుతుంది. చావుకు దగ్గరైన∙అతను బతికున్నప్పుడే ఏదైనా చేయాలనే చింతతో ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటున్న కూతురిని ఉన్న పళంగా పిలిపిస్తాడు. ఆమే సెహమత్‌ ఖాన్‌. రక్తం చూస్తేనే కళ్లు తిరిగిపడిపోయేంత పిరికిది. చీమకు కూడా హాని  కలగొద్దని తపించే సున్నితమనస్కురాలు. స్నేహితుడైన భారత ఇంటెలిజెన్స్‌ అధికారి ఖాలీద్‌ మీర్‌ (జైదీప్‌ అహ్లావత్‌)తో సంప్రదించి తన కూతురిని స్పైగా పాకిస్తానీ బ్రిగేడియర్‌ సయ్యద్‌ ఇంటికి పంపించాలనుకుంటాడు. ఈ విషయాన్నే సెహమత్‌తో చెప్పి ఒప్పిస్తాడు. ఖాలీద్‌ మీర్‌ ఆమెకు శిక్షణనిస్తాడు. బ్రిగేడియర్‌తో తనకున్న స్నేహం, అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని, సెంటిమెంట్‌తో దెబ్బకొట్టి తన కూతురిని బ్రికేడియర్‌ కొడుకు.. ఇక్బాల్‌కు ఇచ్చి నిఖా చేస్తాడు.  పాకిస్తాన్‌కు పంపిస్తాడు కోడలిరూపంలో  స్పైని.

మిషన్‌ స్టార్ట్‌ అవుతుంది..
అత్తారింట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే తన మిషన్‌ను ప్రారంభిస్తుంది సెహమత్‌. ఆ ఇంట్లో పనోడు, నమ్మకస్తుడూ అయిన అబ్దుల్‌.. సెహమత్‌ వచ్చినప్పటి నుంచే ఆమెను అనుమానిస్తుంటాడు. అనుక్షణం నీడలా వెంటాడుతుంటాడు. మొత్తానికి ఓర్పు, నేర్పుతో ఆ ఇంట్లో వాళ్లందరికీ ఆప్తురాలవుతుంది ఒక్క అబ్దుల్‌కి తప్ప. ట్రైనింగ్‌లో నేర్చుకున్న మెళకువలతో భారత నావికా దళం మీద జరుగుతున్న కుట్రను ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలకు అందిస్తుంటుంది. ఆ విషయాన్ని అబ్దుల్‌ పసిగడ్తాడు సాక్ష్యాధారలతో సహా.

ఇంటెలిజెన్స్‌ నేర్పిన విద్యతోనే అబ్దుల్‌ను చంపేస్తుంది.  చీమ చిటుక్కుమంటేనే విలవిల్లాడే తను ఓ మనిషిని చంపేంత  కరుకుగా మారడాన్ని తట్టుకోలేకపోతుంది. ఏడుస్తుంది. అబ్దుల్‌ మరణం సెహమత్‌ బావగారి( భర్త అన్న)కీ మింగుడుపడదు. కూపీ లాగుతుంటాడు. అందులో సెహమత్‌ చిక్కుకునే ప్రమాదం కనపడే సరికి ట్రైనింగ్‌లో నేర్చుకున్న మరో విద్యతో బావగారినీ మట్టుబెడుతుంది. వరుస చావులతో ఆ ఇల్లు షాక్‌కి గురవుతుంది. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ వాళ్ల నిఘా పెరుగుతుంది. తన మీద అనుమానం రాకుండా చనిపోయిన అబ్దుల్‌ మీదకు మళ్లిస్తుంది. 

భారత్, పాకిస్తాన్‌ విభజన జరగకముందు అబ్దుల్‌ భారతీయుడు. విభజన తర్వాత పాకిస్తాన్‌ వచ్చి స్థిరపడ్తాడు. ఆ కారణంతో  అతని మీద సందేహం వచ్చేలా చేస్తుంది. ఆ క్రమంలో భర్తకు దొరికిపోతుంది. ఖంగు తింటాడు. ఇంకోవైపు సెహమత్‌ డేంజర్‌లో ఉందని తెలుసుకొని భారత ఇంటెలిజెన్స్‌ బృందం ఆమెను  కాపాడ్డానికి పాకిస్తాన్‌ వస్తుంది. అయితే అప్పటికే పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ నిఘా ఉండడం వల్ల వాళ్లు సెహమత్‌ను అనుసరిస్తుంటారు. ఇది భారతీయ బృందం కళ్లలో పడి ఆమె ప్రాణాలతో శత్రువులకు దొరికితే ఇండియాకు మరింత ప్రమాదమని సెహమత్‌ను చంపేసే ప్రయత్నం చేస్తారు.

కానీ ఈ ప్రయత్నంలో సెహమత్‌ కాకుండా  తనలా బురఖా వేసుకొని ఉన్న భారత గూఢచార సంస్థ ఉద్యోగినితో పాటు సెహమత్‌ భర్తా చనిపోతారు.భారత ఇంటెలిజెన్స్‌  తీరుకి దిగ్భ్రాంతి చెందుతుంది సెహమత్‌. చివరకు తనను కూడా చంపడానికి వెకడుగువేయని ఆ నిర్ధయకు. తనను నమ్మిన భర్త ప్రాణాలూ తీసినందుకు. మట్టి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఆ యుద్ధ తంత్రాలను ఏవగించుకుంటుంది. తండ్రి అప్పజెప్పిన పనిని పూర్తిచేస్తుంది.  కానీ  విపరీతమైన నైరాష్యంతో ఇండియాకు వస్తుంది.ఇదీ రాజీ.. ఘాజీ ముందు జరిగిన కథ.

– శరాది

>
మరిన్ని వార్తలు