అవకాశాల వేటలో అమ్మ

2 Jul, 2013 07:48 IST|Sakshi
అవకాశాల వేటలో అమ్మ
మణిరత్నం లాంటి ప్రముఖ దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం రావడంతో నటి తులసికి అవకాశాల పరంపర కొనసాగుతుందని, ఆమె భవిష్యత్‌లో మంచి హీరోయిన్ అయిపోతుందని చాలా మంది ఊహించారు. తులసి కూడా ఆశల పల్లకిలో తేలిపోయింది. అయితే అలా జరగలేదు. కడల్ చిత్రం ఊహల్ని తలకిందులు చేసింది. 
 
 అయితే ఆ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన గౌతమ్ కార్తీక్‌పై కడల్ ప్రభావం పని చేయలేదు. అతనికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం గౌతమ్ కార్తీక్ సిపాయి, వైరాజా వై మొదలగు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. నటి తులసికి పాపం ఒక్క అవకాశం కూడా రాలేదు. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న యాన్ చిత్రం అవకాశం కూడా కడల్ చిత్రంలో విడుదలకు ముందు వచ్చిందే. దీంతో చింతామయమైన తులసి తల్లి, ఒకనాటి అందాల రాణి రాధ ఆమెకు అవకాశాలను తెచ్చిపెట్టే వేటలో పడ్డారట.
 
సూర్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న ధృవనక్షత్రం చిత్రంలో హీరోయిన్ కాలేజీ యువతి పాత్ర అట. దీంతో ఈ పాత్ర తులసికి బాగా నప్పుతుందని భావించిన రాధ గౌతమ్ మీనన్‌తో చర్చించేలోపే ఆ అవకాశాన్నినటి సమంత తన్నుకుపోయిందని సమాచారం. దీంతో తులసి కోసం ఆమె అమ్మ అవకాశాల వేట కొనసాగుతూనే ఉందట.