మీటూకు ఆధారాలు అడక్కూడదు

16 Nov, 2018 10:18 IST|Sakshi

సినిమా: మీటూ ఆరోపణలకు ఆధారాలు అడక్కూడదని నటి రాధికాఆప్తే అంటోంది. ఒక్క దక్షిణాదిలోనే కాదు, భారతీయ సినీ పరిశ్రమలోనే సంచలన నటిగా మారింది రాధికాఆప్తే. కాగా మహిళల వేధింపులకు వ్యతిరేకంగా ఇప్పుడు మీటూ బహుళ పాచుర్యం పొందింది. అయితే ఈ మీటూ తెరపైకి రాక ముందే సినీ పరిశ్రమలో అవకాశాల కోసం పడకగదికి పిలిచే సంస్కృతి ఉందనే విషయాన్ని బట్డబయలు చేసిన నటి రాధికాఆప్తే. అలా ఈ అమ్మడు దక్షిణాది, ఉత్తరాది సినీ వర్గాలకు చెందిన పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు తన శృంగార భరిత ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉండే నటి రాధికాఆప్తే. అదేమంటే నా శరీరం నా ఇష్టం అంటుంది.

తాజాగా ఒక భేటీలో ఈ భామ పేర్కొంటూ తాను మీటూకు నూరు శాతం మద్దతిస్తానని చెప్పింది. లైంగిక వేధింపు చర్యలను సహించేది లేదని పేర్కొంది. ఇప్పుడు మీటూ అనేది చాలా అవసరం అని చెప్పింది. అత్యాచార వేధింపులకు గురైన వారు ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోగలుగుతున్నారని, ఇది స్వాగతించదగ్గ విషయం అని అంది. అలాంటి వారికి సమాజం అండగా నిలవడం ఆరోగ్యకరమైన అంశం అని అంది. అయితే మీటూ వ్యవహారంలో ఫిర్యాదు చేసే మహిళలను అందుకు ఆధారాలు అడగడం సబబు కాదని అంది. ఇలాంటి విషయాల్లో ఆధారాలు సేకరించి ఆరోపణలు చేయడం కుదరదని చెప్పింది. ఇకపోతే మహిళలు మగవారి అత్యాచార వేధింపు చర్యలకు వ్యతిరేకించకపోతే వారు తప్పులు చేసుకుంటూనే పోతారని అంది. ఒకసారి తన వెంట పడిన వ్యక్తిని అడ్డగించి బుద్ధి చెప్పానని, అయితే ఆ విషయాన్ని అంతటితోనే మరచిపోయానని చెప్పింది. కానీ చుట్టూ ఉన్న వారు ఆ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నారని, ఇలాంటి వ్యవస్థ మారాలని రాధికాఆప్తే పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు దక్షిణాదికి పూర్తిగా దూరమై బాలీవుడ్‌నే నమ్ముకుందన్నది గమనార్హం. 

మరిన్ని వార్తలు