రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న లారెన్స్‌

29 Oct, 2018 20:45 IST|Sakshi

సామాజిక సేవలో నిత్యం ముందుంటారు నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌. ఇప్పటికే ఎందరో దివ్యాంగులకు పునర్జన్మనిస్తూ.. అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకోవడానికి నేనున్నానంటూ ముందుంటారు లారెన్స్‌. తాజాగా లారెన్స్‌ రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. 

ఇటీవల తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంగోట్టయ్యన్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాఠశాలలే భవిష్యత్‌ సంతతిని ఉన్నతంగా తీర్చిదిద్దే దేవాలయాలని పేర్కొన్నారు. ఆ పాఠశాలలకు ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరిస్తే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్ధులు వాటిని దత్తత తీసుకుని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి వ్యాఖ్యలకు నటుడు రాఘవ లారెన్స్‌ స్పందించి.. చెన్నై, పాడి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, చెంజీ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల దత్తత తీసుకున్నారు. ఈ పాఠశాలలు లారెన్స్‌ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పునఃప్రారంభోత్సవ వేడుకను జరుపుకున్నాయి. ఈ వేడకల్లో పాల్గొనాల్సిన రాఘవలారెన్స్‌.. తన తల్లి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి పొందుతున్నందున హాజరు కాలేకపోయారు. ఆయనకు బదులుగా నటి ఓవియాను ఆ వేడుకలకు పంపిచారు. పాఠశాలల దత్తత అన్నది ఈ రెండు ప్రభుత్వ పాఠశాలతో ఆగదని, తన వల్ల ఎంత సాధ్యమో అన్ని పాఠశాలను దత్తత తీసుకుంటానని తెలిపారు. తాను ఎలాగూ చదువుకోలేకపోయానని, చదువుకునే పిల్లలైనా ప్రశాంతంగా చదువుకోవాలని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు