మరో అభిమాని మరణించకుండా..

4 Feb, 2018 15:47 IST|Sakshi
రాఘవ లారెన్స్(ఎడమ వైపు), అభిమాని ఆర్.శేఖర్( కుడి వైపు)

సాక్షి, చెన్నై : వీరాభిమాని మరణంతో నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన తన అభిమానిలా మరొకరు మృతి చెందకుండా లారెన్స్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు.  ఆర్.శేఖర్ అనే లారెన్స్‌ అభిమాని ఆయనతో ఫోటో తీసుకునేందుకు వెళ్తుండగా చనిపోయాడు. ఇది లారెన్స్‌ను చాలా బాధించింది. దీంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తన కోసం రావద్దని స్పష్టం చేశారు.ఈ మేరకు లారెన్స్ ఓ ట్వీట్ చేశారు.

'హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్‌ ఫ్యాన్స్..! నాతో ఫొటో తీసుకునేందుకు వస్తూ ఇటీవలే నా వీరాభిమాని శేఖర్ చనిపోయాడని మీకందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతని అంత్యక్రియలకు కూడా నేను వెళ్లాను. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ ఘటనతో నేనొక నిర్ణయం తీసుకున్నా. ఇక మీదట నాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎవరూ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నేనే నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వచ్చి వారితో ఫోటోలు దిగుతాను.

ఇప్పటి నుంచి నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా అభిమానులున్న ప్రాంతాలకే వచ్చి ఫోటోలు దిగుతా. మొదటగా ఈ నెల 7న సేలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నేను మీకోసం వస్తున్నా. శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.’’ అని లారెన్స్ ట్వీట్ చేశారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు.
 

మరిన్ని వార్తలు