రెహ్మాన్ కుమారుడు అదరగొట్టేశాడు

11 Feb, 2016 18:25 IST|Sakshi
రెహ్మాన్ కుమారుడు అదరగొట్టేశాడు

చెన్నై: తెలుగు సినిమాకోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ స్వరాన్నందించాడు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం తొలిసారి తెలుగు గీతాన్ని ఆలపించాడు. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. 'రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం కోసం అమీన్ చాలా బాగా పాడాడు. రికార్డింగ్ చాలా అద్బుతంగా వచ్చింది.

మా చిత్ర యూనిట్ అంతా ఇందుకు సంతోషంగా ఉన్నాం' అని చిత్ర వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓ కాదల్ కన్‌మణి(తెలుగులో ఓకే బంగారం) అనే తమిళ చిత్రం కోసం తొలిసారి అమీన్ పాడటం ప్రారంభించాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాకు సినీ నటుడు నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మాతలుగా ఉన్నారు. దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున కూడా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారు.